విశాఖ వైసీపీలో చిచ్చు! జగన్ కు వ్యతిరేకంగా నిరసన
posted on Mar 18, 2021 @ 12:22PM
విశాఖపట్నం కార్పొరేషన్ లో పాగా వేశామని సంబరపడుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు తగిలింది. జీవీఎంసీ మేయర్ ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. మేయర్ రేసులో ముందు నుంచి ప్రచారంలో ఉన్న వంశికృష్ణ యాదవ్ కు కాకుండా మరో మహిళకు అవకాశం ఇవ్వడం వైసీపీలో కలకలం రేపుతోంది. జీవీఎంసీ ఔట్ గేట్ వద్ద వంశీ కృష్ణ శ్రీనివాస్ అనుచర వర్గం ఆందోళనకు దిగింది. వంశీకి మేయర్ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మహిళలు కంటతడిపెట్టుకున్నారు.
సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా వంశీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవీఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగడంతో పరిస్థితి ఉద్రిక్తం మారింది. విశాఖ మేయర్‌గా వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్‌గా జీఎం శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విశాఖ మేయర్ పదవి దక్కకపోవడంపై వంశీ కృష్ణ శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చిన తన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానొక దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వెగానికి లోనయ్యారు. కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని చెబుతూ...నిరసన చేసిన అభిమానులను వంశీ కృష్ణ శ్రీనివాస్ ఓదార్చారు.