పాదయాత్రను అడ్డుకునేందుకు ధ్వంసరచనకు వైసీపీ వ్యూహం?
posted on Oct 21, 2022 @ 10:39AM
అమరావతే రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాయాత్రకు ప్రమాదం పొంచి ఉందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. మహా పాదయాత్ర మరి కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సీఎం జగన్, మూడు రాజధానులంటూ ప్రకటించేశారు. దీంతో విశాఖపట్నం మరి కొద్ది రోజుల్లో కార్యనిర్వాహక రాజధానిగా మారనుందని.. ఇక్కడి నుంచి సీఎం జగన్ పాలన చేయనున్నారంటూ.. ఆ పార్టీలోని కీలక నేతలు వరుస ప్రకటనలు చేసేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతుల పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన వెంటనే.. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. విశాఖలో కార్యనిర్వహాక రాజధాని ఏర్పాటు చేయాలంటూ అధికార పార్టీ చేపట్టిన విశాఖ గర్జన కు ప్రజల నుంచి స్పందన కరవవ్వడం అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రైతుల మహాపాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టడం, మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు పట్టించుకోకపోవడాన్ని గమనిస్తున్న తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు రైతుల మహాపాదయాత్ర విజయవంతంగా అరసవల్లి చేరుకుంటే.. మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ మరింత బలంగా తెరమీదకు వస్తుందని భావిస్తున్నారు.
అదే జరిగితే ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారుతుందన్న ఆందోళనా వారిలో వ్యక్తమౌతోంది. అందుకే అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు కల్పించాలని పార్టీ క్యాడర్ కు స్పష్టమైన సూచనలిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే రాజమండ్రిలో ఎంపీ భరత్ ఆధ్వర్యంలో దాడి జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల మహాపాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించడంతోనే అలజడులు సృష్టించైనా ఆ యాత్రను అడ్డుకోవాలని విస్పష్టమైన ఆదేశాలను పార్టీ శ్రేణులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు విశాఖ, రాజమండ్రి, కాకినాడలో నిర్వహించారు.. మరికొన్ని చోట్ల నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ భారీ ఫ్లెక్సీలు సైతం రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఇక ఈ పాదయాత్రలో పాల్గొన్న వారంతా పెయిడ్ అర్టిస్టులు, రియల్టర్లు, చంద్రబాబు బినామీలంటూ అధికార పార్టీ గుప్పిస్తున్న విమర్శల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే విశాఖ రాజధాని కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల డ్రామాకు సైతం తెరతీశారు.
అయితే ఆ డ్రామా ఒక్క రోజులోనే తుస్సుమంది. ఇక విశాఖ గర్జన కోసం ఏర్పాటైన ఉత్తరాంధ్ర జేఏసీ గర్జన వైఫల్యం తరువాత ఏమైందో ఎవరికీ తెలియదు. ఇలా ఉండగా అమరావతే ఏకైక రాజధాని అంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు అధికార వైసీపీ మినమా అన్ని రాజకీయ పార్టీలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీలో అసహనం పెచ్చరిల్లి ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీసీ గూండాలు ఉత్తరాంధ్రలో కోనసీమలోలా విధ్వంసానికి తెగబడే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ నేతలు అయితే.. వైసీపీ విధ్వంసయత్నాలకు రాజమండ్రిలో మహాపాదయాత్రపై జరిగిన దాడి ఒక శాంపిలా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా విధ్వంస రచనకు అధికార పార్టీ వ్యూహాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.