పవన్ సవాల్.. ఉలుకూ పలుకూ లేని వైసీపీ!
posted on Sep 15, 2023 @ 6:24PM
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలు కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రకటించడానికి ముందు వరకూ వైసీపీ నేతలు టీడీపీ-జనసేన పొత్తులపై విపరీత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దమ్ముంటే జనసేన సింగిల్ గా పోటీ చేయాలని.. తెలుగుదేశం పార్టీకి జనసేన అమ్ముడుపోయిందని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని, ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడనీ వైసీపీ నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడారు.
తెలుగుదేశం గురించి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురించి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి కూడా మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు. నీతి, నిజాయతీలు ఉంటే, దమ్మూ ధైర్యం ఉంటే తెలుగుదేశం , జనసేన పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు విసురుతూ వచ్చారు. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారని.. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అయితే, వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ వైసీపీకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ సీఎం జగన్ మోహన్ రెడ్డికే ఆయన దమ్మూ, ధైర్యం, నీతీ నిజాయితీలకు సవాల్ విసిరారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగానే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని విస్పష్టంగా చెప్పారు. ఈ సమయంలో మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. జనసేనకు దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు అంటున్నారన్న ప్రశ్నకు పవన్ వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానమిచ్చారు. తన పార్టీ ఎలా పోటీ చేయాలో వైసీపీ నేతలు చెప్పాలా.. లేక వాళ్లకి చెప్పి తాను తన పార్టీ నిర్ణయాలు తీసుకోవాలా అని ప్రశ్నించారు. అసలు తన పార్టీ విధి విధానాల గురించి వాళ్లకెందుకని నిలదీశారు.
అక్కడితో ఆగకుండా, జగన్ కు దమ్మూ, ధైర్యం రాజమండ్రి రూరల్ నుంచో లేదా గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచో పోటీ చేయాలని సవాల్ చేస్తున్నాననీ, ఆయన అలా పోటీ చేయడానికి సిద్ధ పడతారా అని ప్రశ్నించారు. ఆ ఒక్క సావాల్ లో వైసీపీ నోళ్లు మూతపడిపోయాయి. ఇప్పటి వరకూ పవన్ సవాల్ కు బదులిచ్చిన వైసీపీ నేత లేరు. పవన్ సవాల్ తో వైసీపీ సైలెంట్ అయిపోవడంతో.. రాజకీయవర్గాలలో ఇప్పుడు ఏ కొత్త చర్చ మొదలైంది. నిజానికి పొత్తులు అనేది రాజకీయ పార్టీల ఇష్టం. తమ భావజాలం, తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కలిసి వచ్చే వారితో ఎన్నికలలో పొత్తులు కూడగొట్టుకొని వెళ్లడం తప్పేమీ కాదు. అయితే.. ఇక్కడ వైసీపీ నేతలు కేవలం రెచ్చగొట్టడమే పనిగా దమ్ము, ధైర్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.
పవన్ ఏకంగా జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాజమండ్రిరూరల్ లేదా గోదావరి జిల్లాల్లో ఏదో స్థానం నుంచి పోటీ చేయాలంటూ చేసిన సవాల్ వెనుక వైసీపీ నోరెత్తలేని బలమైన కారణం ఉంది. దానిపైనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేమిటంటే.. ఇప్పటి వరకూ వైఎస్ జగన్ కుటుంబం రాయలసీమ, మరీ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా బయట వచ్చి పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు. 1978 నుంచి చూసుకుంటే కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్ జగన్ కుటుంబం పోటీ చేస్తుంది. పులివెందుల నుంచి 1978, 1983, 1985లో వైఎస్ రాజశేఖరరెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత 1989లో ఆయన కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994లోనూ వివేకాయే విజయం సాధించారు. మళ్ళీ 1999, 2004, 2009ల్లో వైఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మృతి తర్వాత ఉప ఎన్నికలో విజయమ్మ విజయం సాధించారు. జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని ప్రారంభించిన తరువాత అదే నియోజకవర్గం నుంచి విజయమ్మ మరోసారి విజయం సాధించారు. ఇక 2014, 2019ల్లో జగన్ ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించారు. పులివెందుల దాటి బయటికి వస్తే వైఎస్ వివేకా కడప ఎంపీగా గెలవగా.. తొలిసారి 2014లో వైఎస్ విజయమ్మ కడప జిల్లా దాటి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తే లక్షకు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు.
వైఎస్ సతీమణిగా.. వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ వారి సొంత జిల్లా దాటి బయట పోటీ చేసి గెలవలేకపోయారు. ఆ పరాజయంతో పోలిస్తే.. గత ఎన్నికలలో పవన్ రెండు చోట్లా ఓడిపోవడం, లోకేష్ మంగళగిరిలో పరాజయం పాలు కావడం పెద్ద విషయమేమీ కాదు. వైసీపీ నేతలు గురువిందల్లా పదే పదే పదే పదే తాను రెండు చోట్లా పరాజయం పాలు కావడంపై ఇష్టారీతిన మాట్లాడుతుండటంతో పవన్ డైరెక్ట్ గా జగన్ నే కడప దాటి బయటకు రాగలవా, వచ్చి పోటీ చేసి గెలవగలవా? అని సవాల్ చేసినట్లు కనిపిస్తున్నది. దీంతో సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డే గోదావరి జిల్లాలలో ఒక స్థానానికి పోటీ చేస్తే గెలుస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. గోదావరి ప్రాంతం వైఎస్ ఫ్యామిలీకి అనువుగాని చోటు.. ఇలాంటి చోట జగన్ సర్వశక్తులు ఒడ్డినా గెలవడం సాధ్యమయ్యే పని కాదని తెలుసు కనుకనే వైసీపీ సైలెంట్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.