ఏపీలో రజనీకాంత్ ఎన్నికల ప్రచారం?
posted on Sep 15, 2023 @ 4:14PM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ అస్పష్టంగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు కొత్త కోణంలో స్పష్టమవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చంద్రబాబును జైల్లో కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి మరీ పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరితో పాటు కమ్యూనిస్టులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ-జనసేన కూటమికి ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్ పెరిగిపోయారు. ఇటు ఈ కూటమికి సినీ పరిశ్రమలో కూడా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటు నందమూరి, మెగా కుటుంబాల హీరోలు కూటమికి మద్దతుగా ఉండనున్నారు.
దీంతో పాటు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమికి అండగా ఏపీలో ఎన్నికల ప్రచారం చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. నందమూరి కుటుంబంతో పాటు చంద్రబాబుతో రజనీకాంత్ కు మంచి స్నేహ సంబంధాలున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇటు మెగా కుటుంబంతో కూడా రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉంది. మరోవైపు రజనీకాంత్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. త్వరలోనే బీజేపీ రజినీని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే రజనీకాంత్ ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. ఒకవేళ బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవకపోయినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో ఉన్న సత్సంబంధాల కారణంగా వ్యక్తిగతంగా రజనీకాంత్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తే.. మునిగిపోయే పడవను వదిలేసినట్లుగా బీజేపీ కూడా జగన్ పార్టీకి దూరం జరిగి తెలుగుదేశం, జనసేన కూటమిలో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
దీంతో వచ్చే ఎన్నికలలో రజనీకాంత్ తెలుగుదేశం, జనసేన కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఖాయమేనని చెబుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని, ఆయన ఎప్పుడూ తప్పు చేయరని, చేసిన అభివృద్ధి, సంక్షేమాలే ఆయనకు రక్ష. అవే ఆయనను బయటకు తీసుకవస్తాయి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమి చేయలేవు అంటూ లోకేష్‌కు ధైర్యం చెప్పారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ మధ్య నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన రజనీకాంత్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు విజన్ గురించి వివరిస్తూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ పొగడ్తలలో రాజకీయ అంశాలేమీ లేకపోయినా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా వైసీపీ నేతలు రజనీకాంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి ఒకింత ఆలస్యంగానైనా రజనీకాంత్ స్పందించి వైసీపీ నేతలపై చురకలు వేశారు.
ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కూడా రజనీకాంత్ స్వచ్ఛందంగా స్పందించారు. అరెస్టును ఖండించారు. ఈ పరిణాలన్నిటినీ చూస్తే వచ్చే ఎన్నికలలో విపక్ష కూటమికి రజనీ తనవంతు సహకారం అందిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి రజనీకాంత్ సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవ చేయాలని భావించినా.. ఏవేవో కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో రాజకీయ రంగంలో తన మార్క్ చూపాలని భావించిన రజనీకాంత్ అది కుదరక పోవడంతో ఒకింత అసంతృప్తి ఆయనలో ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆయనకు గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది. అయితే దాని కంటే ముందు.. వచ్చే ఎన్నికలలో దక్షణాది రాష్ట్రాలలో ఆయన ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత రాష్ట్రం కర్ణాటక, ఆయన్ను సూపర్ స్టార్ ను చేసిన తమిళనాడు, తనను ఆదరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన పొలిటికల్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కూడా రజనీ ఎన్నికల ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు