వైసీపీ పార్టీలోనే స్వేచ్ఛ.. టీఆర్ఎస్ లో వైసీపీ విలీనమా..? పొంగులేటి
posted on Apr 18, 2016 @ 12:11PM
తెలంగాణ వైసీపీ నుండి ఖమ్మం ఎంపీగా గెలిచిన ఏకైన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎప్పటినుండో ఈయన పార్టీ మార్పుపై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ.. దీని వెనుక తుమ్మల హస్తం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈవార్తలపై స్పందించిన పొంగులేటి ఆవార్తలను ఖండించారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని పార్టీ నేత చండ్ర నరేంద్ర కుమార్ నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వైసీపీని వీడే ఉద్దేశం, అవసరం తనకు లేవని స్పష్టం చేశారు. అంతేకాదు వైసీపీ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని కూడా చెప్పారు. ఈ నెల 27న తెలంగాణలో ఏదో జరుగుతోందని, టీఆర్ఎస్ లో వైసీపీ విలీనమవుతోందని దుష్ప్రచారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. జిల్లాలో బలం ఉంది. ఇలా తప్పుగా ప్రచారం చేయడం మానుకోవాలి’’ అని ఆయన మీడియాకు హితవు పలికారు.