జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే బిగ్ షాక్.. ఏపీలో అవినీతి పాలనట!
posted on Aug 26, 2021 @ 10:13AM
ఆంధ్రప్రదేశ్ లో అస్తవ్యస్థ, అరాచక పాలన సాగుతుందనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయాలతో ఏపీ అథోగతి పాలవుతోందని, రాష్ట్ర భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి. అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెబుతున్నారు. అధికార వైసీపీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా జగన్ రెడ్డి పాలనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేనే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎంతొ గొప్పగా చెప్పుకునే వ్యవస్థ.. అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే వాలంటీర్ల వ్యవస్థ అవినీతిమయంగా మారిందని అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన 267 మంది వలంటీర్లను తొలగించినట్లు కేతిరెడ్డి చెప్పారు. గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన 10 మందికి మెమోలు ఇచ్చినట్టు తెలిపారు. వలంటీర్లు ప్రతి పథకం అమలులో డబ్బు వసూలు చేస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడిన వలంటీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు.
ఒక్క నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని మొదటి నుంచి టీడీపీ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లంచం ఇవ్వనిదే ఏ పని చేయడం లేదని చెబుతున్నాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడం, తమకు డబ్బులు ఇచ్చిన వారికే పథకాలు వర్తించేలా చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేయే వాలంటీర్ల పని తీరుపై దారుణమైన కామెంట్లు చేయడం రచ్చగా మారింది. సొంత ఎమ్మెల్యేయే అవినీతి గురించి బయట మీడియాతో విమర్శలు చేయాల్సి వచ్చిందంటే అవినీతి ఏ స్థాయిలో అర్ధం చేసుకోవచ్చు.
వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుందని అంటున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైసీపీలోనే చర్చగా మారాయి. మరోవైపు సీఎం జగన్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తన మానస పుత్రికగా భావిస్తున్నారు జగన్. అలాంటి స్కీంపై సొంత పార్టీ ఎమ్మెల్యే కామెంట్ చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.