‘సాక్షి’ వల్లే జగన్ ఓడిపోయాడట...!
posted on Jul 21, 2014 @ 10:50AM
జగన్‌ని ఎన్నికలలో గెలిపించడానికి ఆయన సొంత మీడియా ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. ఆ సంగతి అలా వుంటే జగన్ మీడియా మీద రాజకీయ వర్గాల్లో భారీ స్థాయిలో విమర్శలున్నాయి. అయితే వాటిని జగన్ ఎంతమాత్రం పట్టించుకోరు. తాజాగా జగన్ మీడియా మీద కొత్త విమర్శ వచ్చింది. ‘సాక్షి’ కారణంగానే జగన్ ఓడిపోయాడన్న కామెంట్ వినిపించింది. ఆ కామెంట్ చేసిందే ఏ ఇతర పార్టీ నాయకుడో కాదు.. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యేనే కావడం వెరైటీ. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి కారణంగానే జగన్ ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి జగన్ పత్రిక కాబట్టి అందులో అన్నీ జగన్‌కి అనుకూలంగా వుండే వార్తలే వస్తూ వుంటాయని, ఇతర పార్టీల నాయకులను అదేపనిగా సాక్షి మీడియాలో తిడుతూ వుంటారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఆయన అన్నారు. సాక్షి మీడియా వైసీపీ కరపత్రిక అన్న ముద్ర ప్రజల్లో బలంగా పడటంతోపాటు ఎన్నికల సమయంలో సాక్షి పత్రిక ప్రచురణలు, చానల్ ప్రసారాలు జగన్‌తో పాటు తమ పార్టీలో అతి విశ్వాసాన్ని కల్పించాయని అందుకే తమ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందని ఆయన అన్నారు.