వీళ్ళు టీచర్లు కాదు.. కీచకులు!
posted on Jul 21, 2014 @ 10:28AM
టీచర్లే కీచకులై ఆడపిల్లల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. గురు బ్రహ్మ, గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వర: అని గురువుకు అత్యంత ఉన్నతమైన స్థానం మన సమాజం ఇచ్చింది. అయితే కొంతమంది గురువులు మాత్రం ఆడపిల్లల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అకృత్యాలకు పాల్పడుతున్నారు. నిన్నగాక మొన్న బెంగుళూరులో ఒక స్పోర్ట్స్ టీచర్ ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశం మీద ఇంకా ఆందోళనలు జరుగుతూ వుండగానే అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక కళాశాల లెక్చరర్ కమ్ డైరెక్టర్ తనపై, మరికొందరు విద్యార్థినులపై అత్యాచారం చేశాడంటూ ఆ కళాశాలకు చెందిన ఒక విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతని వేధింపులను తట్టుకోలేక గతంలో కొంతమంది విద్యార్థినులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.