వైసీపీలో అడుగంటిపోయిన గెలుపు ఆశ!
posted on Sep 15, 2023 @ 12:00PM
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, తదననంతర పరిణామాల నేపథ్యంలో వైసీపీ శ్రేణులలో, నేతలలో అంతర్మథనం మొదలైంది. జగన్ భస్మాసుర హస్తం తన నెత్తినే కాకుండా మొత్తం పార్టీ నెత్తిన పెట్టేశారా అన్న అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అసలే ప్రజా వ్యతిరేకతతో ఎన్నికలు ఎదుర్కోవడమే కష్టం అనిపిస్తున్న తరుణంగా, ఆ వ్యతిరేకత ప్రజాగ్రహంగా మారేందుకు చంద్రబాబు అరెస్టు ఉదంతం దోహదపడిందని వారు అంటున్నారు. సాధారణంగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా తదుపరి ఎన్నికలను ఎదుర్కొనేందుకు తన పాలనా కాంలో చేసిందేమిటో, మరో సారి అవకాశం ఇస్తే ఏం చేస్తాము అన్నది చెప్పుకుంటుంది. అయితే జగన్ మాత్రం తన పాలనను విధ్వంసంతో మొదలెట్టి.. ఆరాచకత్వంతో ముగించాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తున్నదని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ జనంలో జగన్ ప్రభుత్వం పట్ల, ఆయన పాలన పట్ల వ్యతిరేకత మాత్రమే ఉండేది.. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో అది ఆగ్రహంగా మారిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ ప్రజాగ్రహాన్ని తట్టుకోవడం కష్టమని, రేపు ఎన్నికల ప్రచారం కోసం వారి ముందుకు వెళ్లే సాహసం ఏ వైసీపీ కార్యకర్తా చేయలేని పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయనీ వారు అంటున్నారు. ఇదంతా జగన్ స్వయంకృతాపరాధమేనని చెబుతున్నారు.
చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ ను గమనించిన ఎవరికైనా సరే జగన్ వ్యక్తిగత ద్వేషంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఇట్టే అవగతమైపోతుందని అంటున్నారు. అందుకే ఇంత కాలం జగన్ ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. ఎందుకొచ్చిన గొడవ.. బయటకు వచ్చి నిరసనలు తెలిపితే కేసులంటూ వేధిస్తారు అంటూ ఆందోళనలకు దూరంగా ఉన్న జనబాహుల్యం.. చంద్రబాబు అరెస్టుతో ఏమైనా ఫరవాలేదు.. వీఆర్ విత్ బాబు అంటూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వైసీపీ శ్రేణులే వివరిస్తున్నాయి. వైసీపీ నాయకులే కాదు.. క్యాడర్ కూడా ఇక నుంచి పార్టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న బావన వ్యక్తం చేస్తున్నారు.
అన్నిటికంటే ప్రధానంగా స్కిల్ స్కాం జరిగిందని కానీ, చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని కానీ జనం నమ్మడం లేదు. దీనిని కుట్రపూరితంగా, కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆయనపై మోపి.. కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా అరెస్టు చేశారనీ, తాను అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యాను కనుక విపక్ష నేతపైనా ఎదో విధంగా అవినీతి బురద జల్లాలన్న ద్రోహపూరిత ఉద్దేశంతోనే జగన్ సర్కార్ చంద్రబాబును అరెస్టు చేసిందని జనం భావిస్తున్నారు. ఆ కారణంగానే రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా చంద్రబాబుకు సంఘీభావం లభిస్తోంది.
1984లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడు ఎంతగా ప్రజాగ్రహం వ్యక్తమైందో..ఇప్పుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా అదే స్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది. అప్పట్లో లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలు బీజేపీ, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వచ్చి ఎలా ఎన్టీఆర్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారో.. అదే విధంగా ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముక్తకంఠంతో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాయి. ఈ అరెస్టుతో జగన్ తన పతనాన్ని తానే శాశించుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అంతే కాకుండా ఇంత కాలం జగన్ పార్టీలో కొనసాగిన తమ రాజకీయ భవిష్యత్ ను కూడా అంధకారబంధురం చేశారని అంటున్నాయి.
అలాగే చంద్రబాబు అరెస్టుతో డోలాయమానంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పొత్తును కూడా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించడం ద్వారా ఖరారయ్యేలా చేసింవది కూడా జగనేననీ అంటున్నారు. మొత్తంగా వైసీపీలో అత్యధికులు ఇప్పుడు పార్టీకి సాధ్యమైనంత దూరంగా ఉంటే గెలుపు, ఓటమి విషయాలు తరువాత ప్రజాగ్రహానికి గురికాకుండా ఉంటామని, అదే చాలనీ భావిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఏమూలో మిణుకు మిణుకు మంటున్నట్లు ఉన్న గెలుపు ఆశ ఇప్పుడు పూర్తిగా అడుగంటిపోయిందన్న భావన వైసీపీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.