చంద్రబాబుతో ములాఖత్ కు భువనేశ్వరికి అనుమతి నిరాకరణ
posted on Sep 15, 2023 @ 12:30PM
స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి చేసుకున్న ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. నిబంధనల మేరకు వారంలో మూడు సార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నప్పటికీ భువనేశ్వరి దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు జైల్లో సరైన భద్రత కల్పించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయనకు కల్పించాల్సిన ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించలేదని.. తొలిసారి ములాఖత్ తరువాత భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెవలుపై వెడుతుండటంతో అసలు రాజమహేంద్రవరం జైలులో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక తన ములాఖత్ దరఖాస్తున్న జైలు అధికారులు తిరస్కరించడంపై భువనేశ్వరి జగన్ సర్కార్ అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ములాఖత్ కు అవకాశం ఉన్నా తిరస్కరించడం కచ్చితంగా కక్ష సాధింపు ధోరణేనని అన్నారు.
మరో వైపు చంద్రబాబుకు జైల్లో భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆయనను ప్రజలకు చూపాలని, ఆయన ఆరోగ్యపరిస్థితి, జైల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆయన నోటి వెంటే తెలుసుకుంటామని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఐయామ్ విత్ బాబు, ఇయామ్ విత్ సీబీఎన్, జైటీడీపీ, జై తెలుగుదేశం హ్యాష్ ట్యాగ్ లతో ఆ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.