రోత పుట్టిస్తున్న వైైసీపీ బురద రాజకీయం!
posted on Sep 2, 2024 @ 9:36AM
ఒక పక్క భారీ వర్షాలు, వరదలతో జనం నానా ఇబ్బందులూ పడుతుంటే వారిని ఆదుకునేందుకు ఒక రాజకీయ పార్టీగా ఎటువంటి చొరవా తీసుకోవడం మానేసి బురద రాజకీయాలు చేస్తూ వైసీపీ ప్రజలలో తన ప్రతిష్ఠను తానే దిగజార్చుకుంటోంది. తన పరువు తానే తీసుకుంటోంది.
రాష్ట్రంలో భారీ వరదలతో ప్రజలు కష్టాలలో ఉంటే.. సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్న అధికార యంత్రాంగానికి సహకారం అందించడం మాని రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోంది. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను ఆధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎలాగూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా జనం కష్టాలపై కనీస స్పందన కూడా లేకుండా తన విదేశీ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. యథారాజా తథా ప్రజ అన్నట్లుగా వైసీపీ అధినేత జగన్ జనం సమస్యలను విస్మరించి సొంత పనుల్లో నిమగ్నమై ఉంటే, ఆయన పార్టీ నేతలు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలలో పత్తా లేకుండా పోయారు. ప్రకృతి విపత్తు సమయంలో సంయమనం పాటించి, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంపై దృష్టి పెట్టాల్సింది వైసీపీ సోషల్ మీడియా వేదికగా రాజధాని అమరావతిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
భారీ వరదలకు ఒక్క విజయవాడ మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాల ప్రజలు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఆ విషయాన్ని విస్మిరించి బెజవాడ మినహా ఇంకెక్కడా భారీ వర్షాలు, వరదల కారణంగా జనం ఇబ్బందులు పడలేదన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న వికృత ప్రచారం ప్రజలకు వెగటుపుట్టిస్తోంది. ఈ తీరు వల్ల వైసీపీ పట్ల జనం మరింత విముఖత చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏడు పదుల పైబడిన వయస్సులో చంద్రబాబు వరద బాధితులకు భరోసా ఇస్తూ, వారికి అండగా ఉంటూ, వారిలో ధైర్యాన్ని నింపుతుంటే... అనుక్షణం వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ జనంలో ఉంటుంటే.. వైసీపీ నేతలు మాత్రం క్షత్ర స్థాయిలో ఎక్కడా కనిపించకుండా, సోషల్ మీడియా వేదికగా అమరావతిపై విషం చిమ్మడాన్ని జనం చీదరించుకుంటున్నారు.
వైసీపీ హయాంలోనూ వరదలు సంభవించాయి. అయితే ఆయా సందర్భాలలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడైనా, ఎప్పుడైనా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన దాఖలాలు లేవు. ఆయన పర్యటనలన్నీ విగంహ వీక్షణాలకే పరిమితమయ్యాయి.
అయితే అందుకు భిన్నంగా చంద్రబాబునాయుడు వరద బీభత్సంలో ఇబ్బందులు పడుతున్న బెజవాడ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటున్నారు. రేయింబవళ్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ బాధితులలో ధైర్యం నింపుతూ ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా ఇస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో కేంద్రం నుంచి పవర్ బోట్లు, వేవీ హెలికాప్టర్ లను రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలకు రప్పించారు. బుడమేరు పొంగి మెరుపు వరద నివాస ప్రాంతాలను ముంచెత్తినా సకాలంలో బాధితులకు సహాయ, పునరావాసాలను కల్పించి చంద్రబాబు సర్కార్ ఆదుకుంది.
రాష్ట్ర మంత్రులను, తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు, నేతలు సకాలంలో లోతట్టు ప్రాంతాల పర్యటించి సహాయక చర్యలలో భాగస్వాములయ్యారు. వీటన్నిటినీ విస్మరించి వైసీపీ తన బురద రాజకీయంతో మరో సారి రోత పార్టీగా నిరూపించుకుంది.