ఏపీకి మరో తుఫాన్ ముప్పు!

ఆంధ్రప్రదేశ్ ను తుపాన్లు వెంటాడుతున్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాష్ట్రంలో ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ, గుంటూరు జిల్లాల ప్రజలు వరదలతో  అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో  ఆంద్రప్రుదేశ్ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు మరింత ఆందోళనకు గురౌతున్నారు.

ఈ నెల 6, 7 తేదీలలో బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ అల్పపీడనం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని,

దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తుపాను తీవ్రత ఎంత ఉంటుందన్నది రానున్న రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.