న్యాయవ్యవస్థపై వైసీపీ మళ్లీ దాడి- సుప్రీం కోర్టు తీర్పునకే వక్ర భాష్యాలు
posted on Aug 2, 2022 @ 11:15AM
కోర్టు తీర్పులను లెక్క చేయకపోవడం, తీర్పులను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా వ్యవహరించడం వైసీపీ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల అధికారులు కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చిన సందర్భాలు ఏపీలో పలు ఉన్నాయి. అయినా తన ధోరణి తనదే అన్నట్లుగా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోంది.
ఈ క్రమంలో ఏకంగా సుప్రీం కోర్టు తీర్పునే తప్పుపడుతూ ఆ పార్టీ ఎంపి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ న్యాయ వ్యవస్థకు వివక్షను ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం కిందట సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదంటూ ఇచ్చిన తీర్పులు ఉటంకిస్తూ వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పు కారణంగా న్యాయవ్యవస్థలో బీసీల సంఖ్య చాలా తక్కువ అయ్యిందనీ, ఆ కారణంగానే కోర్టు తీర్పులలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందనీ విమర్శలు గుప్పించారు.
దుర్భుద్దితోనే సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై తీర్పు ఇచ్చిందని.. వెంటనే దాన్ని ఎత్తి వేయాలని అన్నారు. రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు రాజ్యాంగం సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన అధికారాల దుర్వినియోగమేనని విరుచుకు పడ్డారు. న్యాయవ్యవస్థలో తగినంత మంది బీసీలు లేకపోవడం వల్లే వారికి అన్యాయం జరుగుతోందని సంజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు తప్పుడు ఉద్దేశాలను అపాదించడమనే ప్రమాదకర క్రీడకు వైసీపీఎంపీ సంజీవ్ కుమార్ తెరతీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు టార్గెట్ గా వైసీపీ దాడులు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో వైసీపీ న్యాయవ్యవస్థపై చేయని దాడి లేదు. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరు పరిశీలనలో ఉన్న సమయంలో ఏకంగా ఆయనపైనే తప్పుడు ఆరోపణలు చేశారు. రాష్ట్రపతికి స్వయంగా వైసీపీ అధినేత జగన్ జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో లేఖ కూడా రాశారు. అయితే ఆ ఫిర్యాదులూ, ఆరోపణలూ అన్నీ తప్పుడువని తేలిపోయాయి. జస్టిస్ ఎన్వీరమణ సీజేఐ అయ్యారు. ఈ నెలలోనే ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెలలోనే మళ్లీ న్యాయవ్యవస్థపై వైసీపీ వ్యూహాత్మకంగా దాడి చేస్తోందని న్యాయవర్గాలు అంటున్నాయి. అక్రమాస్తుల కేసుల భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.