చంద్రబాబుకు కేంద్రం ఆహ్వానం
posted on Aug 2, 2022 @ 12:41PM
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి మరో స్పష్టమైన తార్కానం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి కేంద్రం నుంచి ఆహ్వానం అందడం. ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన అనంతరం తొలి సారిగా కేంద్రం ఓ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం పంపింది. అది కూడా ఏదో సాదా సీదా సమావేశం కాదు. కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం అందింది.
ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్రం చంద్రబాబును ఆహ్వానించింది. ఆ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఈనెల 6న హస్తిన వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో ఈ సమావేశం జరుగుతుంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు భారత ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఉత్సవాల నిర్వహణ జాతీయ కమిటీలో చంద్రబాబును సభ్యుడిగా చేశారు.
ఇది రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమమే అయినా, చంద్రబాబుకు ప్రాధాన్యత ఇవ్వడం రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు అంకురార్పణ జరగబోతోందనడానికి తార్కానంగా పరిశీలకులు బావిస్తున్నారు . ఎందుకంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు- మోదీలు ప్రత్యక్షంగా ఎదురుపడిన సందర్బం లేదు. కరోనా పరిస్థితుల్లో దేశంలో సీనియర్ నేతలందరికీ మోదీ ఫోన్లు చేశారు కానీ చంద్రబాబుకు మోడీ నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించడం.. ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఖాయమన్న భావన పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. అసలు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు కేంద్రం ఒకింత దూరం జరిగిందన్న తార్కానాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో పరిస్థితిని ఒక్క సారి గమనిస్తే.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు , రాజకీయ సమీకరణాలు వేగంగా మరి పోతున్నాయన్న భావన కలగక మానదు. అధికార వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సక్షేమ పథకాలపైనే దృష్టిని కేద్రీకరించారు. నీట ముంచినా, పాల ముంచినా, ‘మీటదే’ భారం అన్నవిధంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
అయితే, కొంచెం ఆలస్యంగానే అయినా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఒక చేత్తో మీటలు నొక్కుతో మరో చేత్తో రాష్ట్ర అభివృద్ధి పీక నొక్కుతున్నారని గ్రహించారు. అందుకే, ముఖ్యమంత్రి అలోచనలు, అంచనాలతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. మరో వంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జగన్ రెడ్డి ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ జనంలోకి దూసుకు పోతోంది, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ ప్రజాందోళనలలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు, ముందుకు పోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక బీజేపీ విషయానికి వస్తే,నిజానికి రాష్ట్రంలో బీజేపీ బలం కాదు కదా కనీసం ఉనికిని చాటుకునే పాటి ఓటు బ్యాంకు ఆ పార్టీకి లేదు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఎంతో కొంత ప్రాధాన్యత ఉందంటే అందుకు కారణం జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండటమే. రాష్ట్రపతి ఎన్నిక ఇతరత్రా అవసరాల దృష్ట్యా ఇంతవరకు వైసీపీతో బీజేపీ ప్రేమను చూపించింది. ఆ విధంగా,ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందుల నుంచి బయటపడుతూ వచ్చింది. ఇది వాస్తవం.
అయితే ఇటీవల కాలంలో,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముచ్చటగా మూడేళ్ళుగా సాగుతున్న హనీమూన్ ముగింపుకు చేరుకున్న సంకేతాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ అన్నిటినీ మించి ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవం అవసరమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఈ నేపధ్యంలో, రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే, బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, చంద్రబాబు ‘విజన్’ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నిర్ణయానికి వచ్చిందని, విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, ఇంత కాలం రాజధాని విషయంలో జోక్యం చేసుకోని బీజేపీ ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచనకు వ్యతిరకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగిందని అంటున్నారు. నిజమే, మొదటి నుంచి కూడా బీజేపీ ‘ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి’ అనే అంటున్నా, జగన్ రెడ్డి మూడు ముక్కలాటను అడ్డుకునే ప్రయత్నం జరగలేదు. పైపైచ్చు రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానిదే అని కూడా చెప్పింది. కానీ, ఇప్పడు రాష్ట్ర బీజేపీ అమరావతి పాదయాత్ర చేపట్టింది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక తప్పిదాలను ఎత్తి చూపుతూ హెచ్చరికలు చేస్తోంది. ఈ మార్పు మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం రావడం ఆ విశ్లేషణలకు బలం చేకూర్చుతోంది.