జైలుకెళ్తాననే భయంతోనే సీఎం జగన్ తప్పుమీద తప్పులు... యనమల సంచలన వ్యాఖ్యలు
posted on Oct 16, 2020 @ 3:28PM
ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ రాయడం.. గోప్యంగా ఉంచాల్సిన ఆ లేఖను తరువాత ప్రెస్ కు రిలీజ్ చేయడం పై అటు ఏపీలోను ఇటు న్యాయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై పలు బార్ అసోసియేషన్లు.. పలువురు సీనియర్ న్యాయవాదులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నారని... సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని సీనియర్ న్యాయవాదులే చెప్పారని అన్నారు. దీంతో జగన్ పై కోర్ట్ ధిక్కరణ కేసు ఖాయమని చెప్పారు.
దీంతో ''జైలుకెళ్తాననే భయంతో సీఎం జగన్ తప్పుమీద తప్పులు, అలాగే తప్పుడు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ జైలుకు వెళ్తాడనే చర్చ అయన సొంత పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ తర్వాత సిఎం ఎవరనే ఆలోచనలు కూడా వైసిపిలో జోరుగా చేస్తున్నారు. జగన్ లోని ఆందోళన, వైసిపి కార్యకర్తల్లో చర్చలు ఈ లేఖలో స్పష్టంగా ప్రతిబింబించాయి'' అని అయన అన్నారు.
అంతేకాకుండా ''భస్మాసురుడి మార్గంలో జగన్ నడుస్తున్నాడు. భస్మాసురుడి తరహాలోనే తన చెయ్యి తననెత్తిపై జగన్ ఇప్పటికే పెట్టుకున్నారు. తనపై ఇప్పటికే ఉన్న 31కేసులకు (ఈడి - 7 , సిబిఐ - 11, ఇతర కేసులు - 13) అదనంగా తాజాగా మరో కేసు(కోర్టు ధిక్కరణ కేసు) ను కూడా కొనితెచ్చుకోబోతున్నారు. శిక్షపడితే 6ఏళ్ల అనర్హత వేటు పడుతుందనే భయం జగన్ ను వెన్నాడుతోంది. పదేళ్ల శిక్ష పడితే 16ఏళ్లు పోటీకి కూడా అనర్హుడు అవుతాడు. ఈ 31కేసులతో తన రాజకీయ జీవితం ముగిసి పోతుందనేది జగన్ భయం. సీఎం జగన్ తప్పటడుగులు, తప్పుడు పనులు ఎపి భవిష్యత్తుకే అవరోధాలుగా తయారయ్యాయి'' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఇప్పటికే "బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్, మహిళా న్యాయవాదుల సంఘం తదితర అసోసియేషన్లు అన్నీ జగన్ దుర్బుద్దిని, రహస్య అజెండాను తప్పుపట్టాయి. అంతేకాకుండా విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు జగన్ లేఖను ఖండించారు. సిజెఐకి లేఖ రాయడం ద్వారా జగన్ రెడ్డి రాష్ట్రానికే తలవంపులు తెచ్చాడు. దీంతో దేశవ్యాప్తంగా తన అవినీతిపై జగన్ మళ్లే చర్చ పెట్టాడు. జగన్ రెడ్డి రూ43వేల కోట్ల అవినీతి, 31కేసులు, హవాలా, మనీలాండరింగ్ తదితర తీవ్ర అభియోగాలపై దేశ వ్యాప్తంగా డిబేట్ తెచ్చాడు'' అని అయన అన్నారు.
'సిజెకు లేఖ ద్వారా జగన్ తన స్వార్ధానికి మొత్తం రాష్ట్రాన్నే బలి పెడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఏపీని పాలిస్తున్నాడని దేశం మొత్తం విస్తుపోయేలా చేశారు. తనను నమ్మి ఓట్లువేసిన ప్రజలను కూడా మోసం చేశారు'' అని యనమల విమర్శించారు. అంతేకాకుండా ''అధికారంలో లేనప్పుడు తండ్రి అధికార అండతో... ఇప్పుడు స్వయంగా అధికారం హస్తగతమవ్వడంతో జగన్ మోసాలు, ద్రోహాలు ఎక్కువయ్యాయి. ఇప్పటిదాకా హవాలా, మనీ లాండరింగ్ నేరాలతో రాష్ట్రానికి జగన్ చెడ్డపేరు తెస్తే, ఇప్పుడీ లేఖతో యావత్ దేశానికే తీరని కళంకం తెచ్చాడు. తన నేరాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్న ఉమ్మడి ఏపి హైకోర్టుపై జగన్ పగ పట్టాడు. న్యాయవ్యవస్థపై పగబట్టిన ఒక పాలకుడిని మనం ఇప్పుడే చూస్తున్నాం'' అని అయన మండిపడ్డారు.
తాజాగా ''హైకోర్టును, సుప్రీంకోర్టును జగన్ టార్గెట్ చేశాడు. దీని ద్వారా తన కేసులపై రాబోయే తీర్పులను ప్రభావితం చేయాలనే అయన పథకం వేశాడు. ఇప్పటికే తన కేసులలో సహనిందితులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో నియమించారు. ప్రభుత్వ సీక్రెట్ డాక్యుమెంట్స్ ను కూడా వారి ద్వారా పబ్లిక్ చేయిస్తున్నారు. సిజెకు రాసిన లేఖతోపాటు తన ప్రభుత్వ సలహాదారుతో విడుదల చేయించారు. కోర్టు ధిక్కరణతోపాటు సీక్రెట్ డాక్యుమెంట్స్ బహిర్గతం చేసిన నేరానికి కూడా పాల్పడుతున్నారు. దీంతో రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే నైతిక అర్హత కూడా కోల్పోయారు'' అని యనమలఅన్నారు.
అసలు "ప్రభుత్వాలను కోర్టులు అస్థిర పర్చడం ఎప్పుడైనా విన్నామా..? తన ప్రభుత్వాన్ని న్యాయస్థానం అస్థిర పరుస్తోందన్న సీఎం ఈ దేశంలో ఉన్నాడా..? ఇంత విధ్వంస మనస్తత్వం ఉన్నవారు పరిపాలనకు తగరు. తాజాగా జగన్ రెడ్డి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి, ఏకంగా న్యాయవ్యవస్థనే బెదిరించే స్థాయికి చేరడం జగన్ బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ట. ఇప్పటివరకు ప్రతిపక్షాలను బెదిరించడం, శాసన వ్యవస్థను బెదిరించడం, పరిపాలనా వ్యవస్థను బెదిరించడం, అధికార యంత్రాంగాన్ని బెదిరించడం, మీడియాను బెదిరించడం, ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థనే బెదిరించడం చూస్తున్నాం. ఈ పెడధోరణులను ఇలాగే వదిలేస్తే వీళ్ళు రేపు ఎంతకైనా తెగిస్తారు'' అని అయన ఆరోపించారు. పరిపాలన గాలికి వదిలేసి తన కేసులు,రోజువారీ విచారణ, రాబోయే తీర్పుల గురించి కంగారెత్తి పోతున్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట్లో ముంచేశారు, రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేశారు'' అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.