కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై.. కేకేఆర్ కొత్త కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్
posted on Oct 16, 2020 @ 5:06PM
ఐపీఎల్ కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్(కేకేఆర్) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు దినేశ్ కార్తీక్ ప్రకటించాడు. బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో కెప్టెన్సీ వదలుచుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇక నుంచి ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గన్ చూసుకోనున్నాడు.
ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. దానికితోడు.. తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో.. ఫ్యాన్స్ కార్తీక్ ను కెప్టెన్సీ వదులుకోవాలని డిమాండ్ చేశారు. ఇంగ్లండ్ కు వరల్డ్ కప్ అందించిన మోర్గాన్ ను జట్టులో ఉంచుకొని కార్తీక్ కు కెప్టెన్సీ ఎందుకని కూడా కొందరు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని.. బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
దినేశ్ కార్తీక్ నిర్ణయంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు. దినేశ్ కార్తీక్ వంటి ముందుండి నడిపించే వ్యక్తులు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు. దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని దినేశ్ కార్తీక్ భావించేవాడని, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. కొత్త కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపడుతున్నాడని వెంకీ మైసూర్ వెల్లడించారు.
కాగా, ఈ సీజన్ లో కేకేఆర్ జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది. ఇవాళ ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ తలపడనుంది.