పెద్దవారిలో గాయలు ఎందుకు మానవు?
posted on Dec 24, 2018 @ 11:20AM
వయసు గడిచేకొద్దీ మనలో శక్తి కూడా తగ్గిపోతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. అది అందరి అనుభంలోనూ గమనించే వాస్తవమే! కానీ ముసలివారికి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు, అది అంత త్వరగా ఎందుకు మానదు? దీని వెనుక ఏదన్నా కారణం ఉందా? ఉంటే ఆ లోపాన్ని సవరించే అవకాశం ఉందా?... ఇలాంటి ఆలోచనలే వచ్చాయి రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులకు. ఫలితం! మున్ముందు వృద్ధులకు చేసే చికిత్సలో సమూలమైన మార్పులు తేగల ఒక విషయాన్ని కనుగొన్నారు.
ఇప్పటివరకూ వృద్ధులలో గాయాలు త్వరగా మానకపోవడానికి కారణం వారిలో షుగర్ వంటి వ్యాధులో, రోగనిరోధకశక్తిలో మార్పులో అనుకునేవారు. ఇందులో వాస్తవాన్ని గ్రహించేందుకు పరిశోధకులు రెండు నెలల నుంచి రెండేళ్ల వయసున్న ఎలుకలలో గాయం మానే తీరు గమనించారు. ఈ వయసు మనలో 20 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసుతో సమానం అన్నమాట. వీటికి ఏదన్నా గాయం అయినప్పుడు అక్కడి చర్మంలో జరుగుతున్న పరిణామాలను గమనించారు. సాధారణంగా గాయం అయిన మరుసటి సెకను నుంచే మన శరీరం దానిని బాగుచేసుకునేందుకు తగిన చర్యలను చేపడుతుంది.
చర్మానికి ఏదన్నా గాయం అయినప్పుడు ఆ చర్మం అడుగుభాగంలో ‘కెరటినోసైట్స్’ (keratinocytes) అనే కణాలు చేరుకుని కొత్త చర్మం ఏర్పడేందుకు సహకరిస్తాయట. ఈ కెరటినోసైట్స్ గాయం ఏర్పడిన భాగంలోకి చేరుకోగానే, స్కింట్స్ (Skints) అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ స్కింట్స్ వెంటనే అక్కడి రోగనిరోధకశక్తికి సాయపడుతున్న కణాలకు కొత్త చర్మం ఏర్పడేలా సాయం చేయమంటూ సూచనలు అందిస్తాయి. అయితే ఎలుకల వయసుమళ్లే కొద్దీ ఈ స్కింట్స్ ఉత్పత్తి తగ్గిపోయిందట. దాంతో గాయం మాన్పడంలో కెరటినోసైట్స్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితం! గాయం చాలా నిదానంగా మానడాన్ని గమనించారు.
పెద్దవారిలో గాయాలు నిదానంగా మానడం వెనుక ఉన్న కారణం తెలిసింది సరే! మరి ఈ ఫలితం ఆధారంగా గాయాన్ని మాన్పే ప్రక్రియను గాడిలో పెట్టే అవకాశం ఉందేమో అని మరిన్ని పరిశోధనలు చేశారు. అందుకోసం వయసు మళ్లిన ఎలుకలలో గాయాన్ని మాన్పమంటూ సూచనలు అందించే ప్రొటీన్ ఉత్పత్తిని పెంచినప్పుడు, వాటిలోని కెరటినోసైట్స్ వేగంగా స్పందించడాన్ని గమనించారు. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని మున్ముందు మన కణాల మధ్య ఉన్న సమాచార వ్యవస్థని మరింత వేగవంతం చేసే మందులను ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. అదే కనుక జరిగితే కేవలం గాయాలను మాన్పడంలోనే కాదు, వృద్ధాప్యం కారణంగా వచ్చే మరెన్నో సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు.
- నిర్జర.