ఒక్క వ్యాక్సిన్ సరిపోదు.. సక్సెస్ అయినా లాభం లేదు!!
posted on Jul 21, 2020 @ 5:54PM
ప్రపంచం మొత్తం కరోనా తాకిడికి విలవిలలాడుతోంది. ఒక పక్క విపరీతంగా కొత్త కేసులు నమోదవుతుంటే మరో పక్క మరణాలు కూడా జనాలను భయపెడుతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ కోసం మానవాళి మొత్తం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇది ఇలా ఉంటె కరోనా కు వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ రేసు నడుస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ తో మూడు దశల ట్రయల్స్ పూర్తయ్యాయని రష్యా ప్రకటించింది. వచ్చే నెల ఆగస్టు లో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించవచ్చని తెలిపింది. ఇంకో పక్క ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఆస్ట్రా జెనెకా తో కలిసి తయారుచేస్తున్న వ్యాక్సిన్ తొలిదశ ట్రయల్స్ గ్రాండ్ సక్సెస్ కావడంతో కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసినట్లే అని ప్రపంచం భావిస్తోంది. మిగిలిన రెండు ట్రయల్స్‌లో కూడా విజయవంతం అయితే దీంతో కరోనాకి చెక్ పెట్టినట్లేనని భావిస్తున్నారు. ఇక ఇదే విషయంలో ఇండియాకి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాము కూడా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తో భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు కోరుతున్నామనీ... ఓ వారంలో ట్రయల్స్ ప్రారంభిస్తామని చెబుతోంది.
దాదాపు ప్రపంచం మొత్తం లో దాదాపు 150 వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నట్లు సమాచారం. ఐతే వీటిలో కొన్నైనా సక్సెస్ కావాలని పరిశోధకులు కోరుతున్నారు. ఎందుకంటే ఒక్కటే వ్యాక్సిన్ సక్సెస్ ఐతే.. దాన్నే ఉత్పత్తి చెయ్యడం వల్ల అది ప్రపంచం మొత్తానికీ చేరడానికి చాలా టైమ్ పడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఒకేసమయంలో వేర్వేరు వ్యాక్సిన్లు కనుక తయారైతే కరోనా నుండి త్వరగా బయట పడవచ్చంటున్నారు.