ఆకాశం మీ హద్దు.. ఈ ఐదూ మరవద్దు..
posted on May 25, 2020 @ 9:30AM
చిన్న చిన్న మార్పులు చేయాలని, దానివల్ల శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య తప్పుతుందని తెలుసా?
ఒత్తిడి వుండే ఉద్యోగాలలో వున్నవారు, ఎక్కువగా ప్రయాణాలు చేసే ఉద్యోగాలలో ఉన్నవారు, రాత్రి షిఫ్టులలో పనిచేసేవారు, సమయానికి ఆహారం తీసుకునే వీలు లేనివారు... ఇలా ఎవరెవరి పరిస్థితులు, శారీరక అవసరాలను బట్టి వారు తీసుకునే ఆహారాన్ని నిర్ణయించాల్సి వస్తుందిట.
కాబట్టి ఎవరికి వారు తమ శారీరక అనారోగ్యాలు, పరిస్థితులు, వారి బాధ్యతలు వంటివి నిపుణులతో చర్చించి, వారి సూచనల మేరకు ఓ డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకుని ఆహారం తీసుకుంటే ఇప్పుడు స్త్రీలు ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. చూశారా... ఏదో ఒకటి తిన్నామా లేదా అది చాలు అనుకుంటే ఎంత పొరపాటో.
ఇంటిల్లిపాది ఆహారంపై శ్రద్ధ పెట్టే స్త్రీలు తాము తీసుకోవాల్సిన పోషకాహారం గురించి కనీస అవగాహన కలిగి వుండటం లేదన్నది ఎన్నో అధ్యయనాలలో బయటపడ్డ అంశం.
ఆహారానికి, ఆరోగ్యానికి ఉన్న అనుబంధం తెలిసిందే కాబట్టి ఈ ఉమెన్స్ డే రోజున ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టండి.
2. ఆరోగ్యంపై శ్రద్ధా తక్కువే
ఆడవారిపై మరో ముఖ్య ఆరోపణ. ‘‘వారు వారి ఆరోగ్యంపై శ్రద్ధ అస్సలు పెట్టరు’’ అని. మగవారితో పోలిస్తే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటంలో వీరు చాలా అశ్రద్ధ కనబరుస్తారట. అంతేకాదు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలని పట్టించుకోకుండా అవి పెరిగి పెద్దవయ్యి, పెద్ద అనారోగ్యాలకు దారి తీసేంత వరకూ డాక్టర్ల దగ్గరకి వెళ్ళరని కూడా ఓ ఆరోపణ.
ఇవన్నీ ఎవరో సరదాగా అన్న మాటలు కాదు. కొన్ని వేలమందిపై చేపట్టిన అధ్యయనంలో బయటపడ్డ అంశాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే కొందరు ఆడవారిని ఈ సమస్య ఆనవాళ్ళు ఎప్పుడు తెలిశాయని అడిగినప్పుడు విస్మయపరిచే అంశాలు తెలిశాయి. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులలో కూడా ఆ లక్షణాలను గుర్తించలేదని తెలిసింది. దానికి కారణం రోజువారి ఒత్తిడులు, ఉద్యోగం, కుటుంబాన్ని సమన్వయపరుచుకోవడంలో తమ గురించి తాము అస్సలు ఆలోచించుకోలేకపోవటం అంటున్నారు అధ్యయనకర్తలు. దీనికి పరిష్కారం ఏమిటి అంటే, బాధ్యతలను పంచటం.
అటు కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కాని బాధ్యతలు పంచుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఆడవారిపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఏమైనా అనుమానం ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం అలవాటుగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండచ్చు. ఆరోగ్యంగా వుంటే ఆకాశాన్నయినా తాకచ్చు. ఏమంటారు? ఈ ఉమెన్స్ డేకి ఇది మీరు తీసుకోవలసిన రెండో రెజల్యూషన్.
3. వ్యాయామం అసలే లేదు
శారీరక వ్యాయామానికి ఎంత సమయం కేటాయిస్తారు అని అడిగితే అరవై ఏడు శాతం మంది అస్సలు లేదు అన్నారట. అదిగోమరి ఆరోగ్యం పాడవదూ అలా చేస్తే అంటున్నారు నిపుణులు. సమయం లేదని సాకు చెప్పకండి. వ్యాయామానికి సమయం ఉండేలా మీ దినచర్యని రూపొందించుకోండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే ఒక్కటే సూత్రం... ‘‘మితంగా తినడం, రోజూ వ్యాయామం చేయడం’’. అది ఎంత అవసరమో గుర్తించి, ఆచరించండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఇతరులనీ మోటివేట్ చేయండి.
4. రిలాక్సా? నో ఛాన్స్!
మీరెలా రిలాక్స్ అవుతారు? మిమ్మల్నే అడిగేది. రోజూ మీరెలా రిలాక్స్ అవుతారు? దానికి ఎంత సమయం కేటాయిస్తారు? ఆలోచనలో పడ్డారా? మీలానే ఈ ప్రశ్న అడగగానే ఆలోచనలో పడ్డారుట ఎంతోమంది. వారి నుంచి వచ్చిన సమాధానాలు ఏంటో తెలుసా? రాత్రి నిద్రపోవడమే రిలాక్స్ అవటం అని, పిల్లలని చదివించటం అని, వాళ్ళతో కబుర్లని... ఇలా రకరకాలుగా చెప్పారుట.
అయితే దీని మొత్తంలో మీరు మీకు నచ్చినట్టుగా రిలాక్స్ అయ్యారా ఎప్పడైనఅ అంటే ‘నో’ అని ముక్తకంఠంతో చెప్పారుట. అలాగే టీనేజ్‌లో వుండగా హాయిగా రోజూ నచ్చిన పుస్తకం ఓ గంట అయినా చదివేదాన్ని అని ఒకరు, మ్యూజిక్ వినేదాన్ని అని ఒకరు, గార్డెనింగ్ చేసేదాన్ని అని ఇంకొకరు, ఒక్కర్తిని కూర్చుని ఆకాశాన్ని చూస్తుంటే భలే హాయిగా వుండేది అని మరొకరు చెప్పారుట.
మరి అవి ఇప్పుడెందుకు చేయడం లేదు అంటే అందరిదీ ఒకటే సమాధానం.. ‘‘టైమ్ లేదు’’. మీ సమాధానం కూడా అదేనా? అయితే దానికి నిపుణులు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా? ‘‘రిలాక్స్ అవటం మీ సామర్థ్యాన్ని పెంచుతుందని గట్టిగా నమ్మండి.
అప్పుడు రిలాక్స్ అవటానికి మీకు టైమ్ అదే దొరుకుతుంది. మీ ప్రయారిటీ లిస్టులో దానికసలు చోటే లేకపోతే ఎలా? దాన్ని ఫస్టు ప్లేసులోకి తీసుకురండి. బదులుగా అది మిమ్మల్ని అన్నిట్లో ఫస్టుగా వుంచుతుంది’’ అంటున్నారు. సో... రిలాక్స్ అవ్వటంలో తప్పులేదు... తప్పుకాదు అని గట్టిగా నమ్మండి. మీ హాబీల దుమ్ము దులిపి హాయిగా రిలాక్స్ అయిపోండి.
5. గాఢమైన నిద్రా కరువే
ఇది చదివితే మీ మీద మీరే బోల్డంత జాలిపడిపోతారు. మొన్నామధ్య అమెరికాలో ‘‘సొసైటీ ఫర్ ఉమన్ హెల్త్ రీసెర్చ్’’ చేసిన పరిశోదనలో ఆడవాళ్ళు అసలు గాఢంగా నిద్రపోవడమే లేదని తేలింది. మగవారితో పోలిస్తే ఆడవారు నిద్రలోకి జారుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని, పడుకున్నా మగవారిలా గాఢంగా నిద్రపోయే సమయం తక్కువని తేలింది.
అలాగే ఆడవారు ఎదుర్కొనే ఎన్నో అనారోగ్య సమస్యలకి నిద్రలేమే కారణమని కూడా తేలింది. దీనికి ఒకరకంగా ఆడవారిలోని ప్రత్యేక హార్మోన్లు కారణం. నెలసరికి ముందు, వెనక స్త్రీలు ఎక్కువగా నిద్రలేమి సమస్యని ఎదుర్కొంటున్నారట. పెళ్ళయ్యాక, గర్భం, కాన్పు తర్వాత శరీరంలో ఏర్పడే పరిణామాలు, వీటికి తోడు ఇల్లు, ఉద్యోగ బాధ్యతలూ... ఇవన్నీ స్త్రీల గాఢమైన నిద్ర వేళల్ని హరిస్తున్నాయని ఆ పరిశోధన తేల్చింది.
మరి పరిష్కారం ఏంటీ అంటే, మొదట నిద్రలేమితో బాదపడుతున్నామని గుర్తించాలిట. నిద్రకు నిర్ణీత సమయాలని ఏర్పాటు చేసుకోవాలి. మనసు అలజడి లేకుండా వుండే గాఢమైన నిద్ర స్వంతమవుతుంది. కంటినిండా నిద్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ముక్తాయింపు...
ఉమెన్స్ డే ఉద్దేశం ఈ రోజున ఒక్కసారి ఇప్పటిదాకా సాగించిన ప్రస్థానాన్ని సమీక్షించుకుని, సాగించాల్సిన ప్రయాణానికి సర్వసన్నద్ధం కావటం. స్త్రీల పట్ల మారాల్సిన సమాజం, ప్రభుత్వ దృక్పథాల గురించి గొంతెత్తినట్టే - అసలు మూలాలని కూడా బలపరుచుకునే దిశగా కూడా ఒక్కసారి దృష్టి సారించాలి. శారీరక ఆరోగ్యంపై మానసిక ఆరోగ్యం, ఈ రెండిటి మీద మీరు సాధించే విజయం ఆధారపడి వున్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు మరింత దృఢంగా మార్చుకునేందుకు పైన చెప్పిన ఐదు అంశాలు ఎంతో కీలకం.
ఆ అయిదే కాదు.. ఇంకా చిన్నాపెద్దా అంశాలు ఎన్నో వున్నాయి ఆడవారు నిర్లక్ష్యం చేసేవి. అయితే అతి ముఖ్యమైనవి ఇవి కాబట్టి కనీసం వీటిపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని మీరు సానబెట్టుకుని దూసుకుపొండి. ఆఖరుగా ఒక్కమాట.
ఎప్పటికప్పుడు విజేతలుగా నిలిచిన మహిళల జీవన పంథాని, వారు అనుసరించే విధానాలని గమనించండి. వాటిని అనుసరిస్తే పొందే లాభాలని గుర్తించండి. మార్పు మంచిదే అని నమ్మండి. ఓ స్త్రీ.. నీకు నీవే సాటి.. నీ విజయాలకి మా జోహార్లు. సాధించబోయేదానికి శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-రమ