కోవిడ్ టీకా కొనుగోలు చేసిన ధనిక దేశాలు! పేద దేశాల్లో సంక్షోభం వచ్చే ప్రమాదం?
posted on Dec 11, 2020 @ 6:04PM
బలిసినోడిదే రాజ్యమంటారు. పవర్ ఉన్నవాడికే వస్తాయంటారు. ఇవన్ని కరోనా వ్యాక్సిన్ విషయంలో అక్షర సత్యాలవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న ఆందోళనే నిజమవుతూ.. కరోనా టీకా కొనుగోలులో ధనిక దేశాలు తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. కరోనా టీకాను ధనిక దేశాలే భారీగా కొనుగోలు చేశాయి. మంచి ఫలితాలిస్తున్న అన్ని వ్యాక్సిన్ల కోసం ముందుగానే భారీగా ఒప్పందాలు చేసుకున్నాయి. కొన్ని దేశాలు తమదేశంలో ఉన్న ప్రజలకంటే అధికంగా టీకాలు కొనుగోలు చేసి పెట్టుకోగా.. కొన్ని పేద దేశాలు తమ జనాభాలో కనీసం ఒక్క శాతం జనానికి సరిపడా కరోనా వ్యాక్సిన్ ను కొనలేకపోయాయి .దీంతో పేద దేశాలకు సరిపడా కరోనా టీకాలు అందే అవకాశం లేకుండా పోయిందని అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనం తెలిపింది.
కరోనా టీకా డోసుల పరంగా చూస్తే అత్యధికంగా భారత్ 1.6 బిలియన్ల డోసుల్ని కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక డోసుల్ని కొనుగోలు చేస్తున్న దేశం భారత్ అయినప్పటికీ.. వాటితో దేశంలోని 59 శాతం మందికి మాత్రమే టీకా అందనుంది. జనాభాపరంగా చూస్తే కెనడా ఏకంగా ఆ దేశ జనాభా మొత్తానికి ఐదు కంటే ఎక్కువ సార్లు పూర్తి స్థాయి టీకా అందించేందుకు సరిపడా డోసుల కోసం కొనుగోలు ఒప్పందం చేసుకుంది. వారి జనాభా కంటే దాదాపు 601 శాతం అధిక వ్యాక్సిన్లను కొనుగోలు చేసింది. ఐరోపా సమాఖ్య 1.36 బిలియన్ల డోసులకు ఒప్పందాలకు కుదుర్చుకుంది. 1.1 బిలియన్ డోసులతో అమెరికా మూడో స్థానంలో ఉంది. డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో ఏర్పాటైన కొవాక్స్, కెనడా, యూకే తర్వాతి స్థానంలో ఉన్నాయి. అమెరికాలో వారి జనాభాతో పోలిస్తే 443 శాతం, యూకే 418 శాతం, ఆస్ట్రేలియా 226 శాతం, ఐరోపా సమాఖ్య 244 శాతం అధిక టీకాలు కొనుగోలు చేయనున్నాయి. మెక్సికో 84 శాతం, బ్రెజిల్ 46 శాతం, కజఖ్‌స్థాన్ తమ దేశ జనాభాలో 15 శాతం మందికి సరపడా టీకాల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ జాబితాతో ఫిలిప్పైన్స్ అట్టడుగున నిలిచింది. ఆ దేశ జనాభాలో కేవలం ఒక శాతం మందికి మాత్రమే సరిపడా వ్యాక్సిన్లను కొనుగోలు చేయగలిగింది.
ప్రపంచ జనాభాలో కేవలం 14 శాతం వాటా కలిగిన దేశాలే 50 శాతం కరోనా టీకాల కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో పేద దేశాల్లో పది మందిలో కేవలం ఒకరికి మాత్రమే టీకా అందనుంది. సత్ఫలితాలిస్తున్న ఫైజర్ టీకాలో 96 శాతం డోసుల్ని ఇప్పటికే ధనిక దేశాలు కొనుగోలు చేసేశాయి. ధనిక దేశాల తీరుతో అన్ని దేశాలకు టీకా సమానంగా అందించాలన్న లక్ష్యంతో డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో ఏర్పాటైన కొవాక్స్ కూటమి లక్ష్యం నీరుగారిపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధనిక దేశాలు పెద్ద మనసు చేసుకొని సహకరించకపోతే పేద దేశాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. కనీసం ఉత్పత్తిని భారీ ఎత్తున పెంచేందుకు ఆర్థిక సహాయమైనా చేయాలని తెలిపారు. లేదంటే పేద, మధ్యాదాయ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆకలి చావులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.