కేంద్ర మంత్రి సాక్షిగా అవార్డు వద్దు పొమ్మన్న వ్యవసాయ శాస్త్రవేత్త
posted on Dec 11, 2020 @ 6:03PM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దులో రైతులు రెండు వారాలుగా పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా ఇదే విషయం పై ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త తనకు వచ్చిన అవార్డును కూడా మంత్రి సాక్షిగా సున్నితంగా తిరస్కరించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను కాపాడవని, వాటిని వెంటనే రద్దు చేయాలని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (పీఏయూ)లో భూ సార శాస్త్రవేత్త డాక్టర్ వర్దీందర్ పాల్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డును ఆయన తిరస్కరించారు. ప్లాంట్ న్యూట్రిషన్ రంగంలో అయన చేసిన కృషికి గాను ఫెర్డిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆయనకు అవార్డును ప్రకటించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోవాల్సి ఉండగా, సింగ్ పేరు ప్రకటించగానే ఆయన స్టేజ్ మీదకు వచ్చి, రోడ్ల పైన రైతులు ఆందోళన చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అవార్డు తీసుకోవడానికి తన అంతరాత్మ అంగీకరించనందునే దీనిని తిరస్కరిస్తున్నట్టు చెపుతూ సున్నితంగా నిరాకరించారు.
''రైతుల వాదన సరైనదేనని చెప్పి ఆ అవార్డును తిరిగి ఇచ్చేశాను. ఈ చట్టాలను రద్దు చేయాలి. ఇవి రైతుల ప్రయోజనాలను ఏమాత్రం కాపాడవు. ఒక్క పంజాబు రైతులు మాత్రమే కాక దేశంలోని రైతులంతా నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఏ ఒక్కరూ వారి గోడును పట్టించుకోవడం లేదు. పైగా వారిని టెర్రరిస్టులుగా సంబోధిస్తున్నారు. వాళ్లు టెర్రరిస్టులు కాదు, రైతులు" అని సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.