నోస్ట్రాడమస్ జోస్యం నిజం కానుందా?

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? 2025లో ప్రపంచ వినాశనానికి నాంది ఏర్పడుతుందని ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ చెప్పిందే నిజమౌతుందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే జవాబు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాస్త్ర వినియోగానికి సై అంటూ చేస్తున్న హెచ్చరికలు, అమెరికా, నాటో దేశాలపై ఆయన వెల్లగక్కుతున్న విద్వేషం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మానవాళి ముంగిట్లోకి వచ్చేసిందనే అనిపిస్తున్నది. ఉక్రెయిన్ తో యుద్ధం రష్యాకు నష్టాలు, అపజయాలే కాదు అవమానాలనూ తెచ్చి పెట్టింది. ఉక్రెయిన్  నోటో దేశం కాకపోయినా, రష్యా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తున్న నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. ఆయుధాలు సరఫరా చేశాయి. అమెరికా కూడా ఉక్రెయిన్ కు ఆర్థికంగా, ఆయుధాల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించింది. దీంతో రోజులలో పూర్తైపోతుందని రష్యా భావించిన యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ కంటే అన్ని విధాలుగా రష్యాకే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ స్థితిలోనే పుతిన్ ఇటీవల ఆర్మీ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో కీలక ఆదేశాలు జారీ చేశారు. 

అవసరమైతే అణ్వస్త్రాలను వినియోగించడానికి అనుమతించే ఫైల్ పై సంతకం కూడా చేసేశారు.  దీంతోనే ప్రపంచ వినాశనం గురించి నోస్ట్రాడమస్ చెప్పిన జోస్యం నిజం కానుందన్న భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా,నాటో దేశాలపై రష్యా బ్లాస్టిక్ మిస్సైల్స్ గురిపెట్టి సమయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక వేళ రష్యా నేరుగా నాటో దేశంపై దాడి చేస్తే మూడో ప్రపంచయుద్ధం ప్రారంభమైనట్లే.

అసలు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆరంభం అయినప్పుడే ప్రపంచ దేశాలకు చెందిన ప్రసిద్ధ విశ్లేషకులు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఊహించారు. ఇప్పుడు రష్యా తీసుకున్న నిర్ణయం వారి ఊహలు.. ఊహాగానాలు కాదనీ, వాస్తవ రూపం దాల్చేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అర్ధమౌతోంది.  అణు దాడులు చేస్తామని పుతిన్ ఎలాంటి బేషజాలూ లేకుండా ప్రపంచ దేశాలను హెచ్చరించారు.  త్తగా రూపోందించిన ఓరెప్నిక్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఈ యుద్ధంలో పరీక్షించాలని నిర్ణయం తీసుకున్న పుతిన్ ఈ మేరకు ఇప్పటికే తన సైన్యాధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు.  ఇప్పటివరకూ ఈ మిస్సైల్స్ ను అడ్డుకునే వ్వవస్థ లేదు కాబట్టి ప్రపంచ దేశాల లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యా పరీక్షించాలనుకుంటున్న బాలిస్టిక్ మిస్సైల్స్ 5000  కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సులువుగా ఛేదించేయగలవు. నాటో దేశాలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అందుకే రష్యా ఆ మిస్సైల్ ను ప్రయోగిస్తే.. నాటో దేశాలు అనివార్యంగా రష్యాపై దాడులకు ఉపక్రమిస్తాయి. అదే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. అయితే రష్యా కూడా అందుకు సిద్ధంగానే ఉంది.

ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై యుద్ధానికి వస్తే తనకు మద్దతుగా నిలిచే దేశాలను కూడగడుతోంది. ఇప్పటికే   ఉత్తర కొరియా,చైనా రష్యాకు మద్దతు ప్రకటించాయి.  ఆ ధైర్యంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కు సహాయం చేసిన దేశాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.  ఈ తరుణంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు ఉక్రెయిన్, రష్యాలకు మధ్యవర్తిత్వం చేయగలిగే ప్రపంచ నేత ఎవరన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది. ప్రధాని మోడీ ఆ పని చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. యుద్ధాన్ని ఆపడమే తక్షణ కర్తవ్యంగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నోస్ట్రాడమస్ జోస్యం ఎట్టిపరిస్థితుల్లోనూ నిజం కాకూడదు.