ఇకపై ఈ విధాన్ అప్లికేషన్ ద్వారానే ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు!
posted on Nov 26, 2024 @ 1:15PM
ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కచ్చితంగా డిజిటల్ లిటరేట్లుగా మారి తీరాలి. ఇప్పటికే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి అయితే ఏం ఇబ్బంది లేదు కానీ, ఆ జ్ణానం లేనివారు డిజిటల్ నాలెడ్జ్ పెంచుకోకపోతే మాత్రం ఇబ్బంది పడక తప్పదు. ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా వారు తడబాటుకు గురి కాక తప్పదు. అన్నిటికీ తమ పీఏలు, పీఎస్ ల మీద ఆధారపడక తప్పదు. అలా అధారపడటం వల్ల జనంలో చులకన కాకా తప్పదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి ఈ విధాన్ అప్లికేషన్ లోనే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతాయి. కేంద్రం ఇప్పటికే ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ రూపొందించింది. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న వారికి ఇబ్బంది లేదు. లేదంటే తన పీఎస్‌లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆధార పడాల్సిందే. ఎందుకు అంటే...
కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఈ– విధాన్ అప్లికేషన్‌ను రూపొందించింది. దీనిని దేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా, మండలి అయినా వినియోగించుకోవచ్చు. కానీ అందుకు ఒక నిర్దుష్ట విధానాన్ని అనుసరించాలి. అయితే ఈ విధానాన్ని అనుసరించాలా వద్దా అన్నది ఆయా రాష్ట్రాల అసెంబ్లీల నిర్ణయం. ఇష్టం ఉంటే ఉపయోగించుకోవచ్చు. లేకుంటే లేదు. అయితే టెక్నాలజీయే భవిష్యత్ అని విశ్వసించే చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ను వినియోగించుకుని పేపర్ లెస్ గా అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరికీ ట్యాబ్ లు అందజేయాలని నిర్ణయించింది. ఈ ట్యాబ్‌ల ద్వారా ఏదైనా అసెంబ్లీ, శాసన మండలికి సంబంధించిన అన్ని అంశాలూ తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రశ్నోత్తరాల సమయానికి నోటీసులు ఇవ్వడం, రకరకాల పత్రాలు సమర్పించడం, సభ్యుల నుంచి నోటీసులు స్వీకరించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, కమిటీల నివేదికలు సమర్పించడం, బులిటెన్‌లు జారీ చేయడం వంటివన్నీ ఇకపై డిజిటల్ రూపంలోనే జరుగుతాయి. సెక్రటరీ జనరల్ తోనూ, మంత్రులైతే తమ శాఖల కార్యదర్శులతోనూ చాటింగ్ ద్వారా ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల్లో వాడుకోవచ్చు. సభ్యులు ఎప్పుడైనా తమ నోటీసులు సెక్రటరీ జనరల్‌కు పంపొచ్చు. వాటిని శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్‌కు సెక్రటరీ జనరల్ పంపొచ్చు. ఒకే రకమైన ప్రశ్నను చట్ట సభల్లో ఒకరికంటే ఎక్కువ మంది అడిగితే అందరి పేర్లను ఒకే ప్రశ్న వద్ద చేర్చి సమాధానం ఒకటిగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా స్టేషనరీ వృధా అనేదే లేకుండా పోతుంది. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కంప్యూటర్ శిక్షణ అనివార్యం. ప్రస్తుత ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యుల్లో చాలా మంది బిటెక్ పూర్తి చేసిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో బిటెక్ చదివిన వారైతే పరవాలేదు. పదేళ్లకు ముందు చదువు పూర్తి చేసిన వారైతే మారిన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఈ అప్లికేషన్‌ను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఆ నాలెడ్జ్ లేని వారు తప్పని సరిగా డిజిటల్ లిటరేట్లు అవ్వడానికి శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. దాని కంటే ముందు కంప్యూటర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. ఇదంతా జరగడానికి ముందే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి ఉమంగ్ నరులా సమక్షంలో ఏపీ అ సెంబ్లీ
ఏపీతో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌తో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి ఉమంగ్ నరులా సమక్షంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్యప్రకాశ్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, మండలి చైర్మన్ మోసేనురాజు సమక్షంలో జరిగింది. సో ఇక ఇప్పడు ఏపీ ఎమ్మెల్యేలు. ఎమ్యెల్సీలు డిజిటల్ లిటరేట్స్ అయ్యేందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరి.