ట్రంప్ వచ్చి వంద రోజులు! వంద సాకులు వెదికే పనిలో హిల్లరీ!
posted on May 3, 2017 @ 3:49PM
ఓటమి అంగీకరించటం ఆషామాషీ కాదు! అదీ ఓటర్లు అందించే చేదైన ఎన్నికల ఓటమి అంగీకరించటం మరింత కష్టం! ఇందుకు చక్కటి ఉదాహరణ ఈ మధ్య కాలపు ఇండియన్ ఎలక్షన్సే! 2014నుంచీ మోదీ గాలి వీస్తోంది. ఎవరు కాదన్నా ఔనన్నా బీజేపి గతంలో ఎప్పుడూ లేనంత బలంగా ఇప్పుడుంది. అందుక్కారణం మోదీ, అమిత్ షాలే! కాని, ప్రతీ పక్షాలు ఈ సత్యం అంగీకరించటానికి ఇష్టపడటం లేదు. యూపీ ఎన్నికల తరువాతైతే ఈవీఎంలే తమ పాలిటి విలన్లని కొత్త వాదన తెస్తున్నాయి!
యూపీలో దారుణమైన ఓటమి తరువాత బీఎస్పీ మొదలు కాంగ్రెస్ దాకా అన్ని పార్టీలు ఈవీఎంలే తమ కొంపముంచాయని వాపోయాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయనే అంటున్నాడు! అయితే, ఇలాంటి సాకులు చెప్పే వ్యవహారం ఇండియన్ పొలిటీషన్స్ కి మాత్రమే పరిమితం అనుకుంటున్నారా? అమెరికాలోనూ వుంది!
మన దగ్గర ఈవీఎంల వల్ల ఓడిపోయామంటున్నాయి పార్టీలు! అమెరికాలో ట్రంప్ చేతిలో ఓడిన హిల్లరీ ఏమంటోందో తెలుసా? వైట్ హౌజ్ లో కాలుపెట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ట్రంప్ రష్యా సాయంతో గెలిచాడని చెబుతోంది హిల్లరీ! అంతే కాదు, తన ఓటమికి ఎఫ్భీఐ డైరెక్టర్ జేమ్స్ కామె కూడా కారణం అంటోంది!
పోయిన సంవత్సరం సరిగ్గా ఎన్నికలకి కొద్ది రోజుల ముందు ఎఫ్బీఐ డైరెక్టర్ హిల్లరీని టార్గెట్ చేశాడు. ఆమె మీద వున్న ప్రైవేట్ మెయిల్స్ కేసు తిరగదోడనున్నట్టు ప్రకటించాడు. మళ్లీ అలాంటిదేం లేదని హిల్లరీకి క్లిన్ చీట్ కూడా ఇచ్చేశాడు. కాని, ఈ వ్యవహారం ఓటర్ల దృష్టిలో తనని దారుణంగా దెబ్బతీసిందని బాధపడుతోంది హిల్లరీ! ఇప్పటికీ ఎఫ్బీఐ డైరెక్టర్ చేసిన ఆ పని వల్లే తాను ఓడానని మిసెస్ బిల్ క్లింటన్ పబ్లిగ్గా చెబుతోంది. అంతే కాదు, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా తనని ఓడించాడని ఆమె అంటున్నారు. అమెరికన్ ఎన్నికల్లో రష్యా వేలు పెట్టిందనీ, ట్రంప్ కి అనుకూలంగా, తనకి వ్యతిరేకంగా ప్రచారం జరిగేలా చూసిందనీ హిల్లరీ పేర్కొన్నారు! వికీలీక్స్ ని అడ్డు పెట్టుకుని రష్యా అమెరికా ఎన్నికల మీద ప్రభావం చూపిందని ఈ మాజీ ఫస్ట్ లేడీ వాదన!
హిల్లరీ తాజా వ్యాఖ్యలపై ట్విట్టర్ లో స్పందించిన ట్రంప్ ఆమె మాటల్ని కొట్టిపారేశాడు. అదంతా ఒట్టిదేనని అన్నాడు. రష్యా, ఎఫ్బీఐ అన్నీ కారణమే తప్ప తాను మాత్రం కారణం కాదని హల్లరీ భావిస్తోందని వెటకారం చేశాడు!
ట్రంప్ , హిల్లరీల మాటల యుద్ధం ఎలా వున్నా… ఒక్కటి మాత్రం నిజం! ఓటర్లు ఒక వ్యక్తినో, పార్టీనో ఎంచుకున్నాక ఎఫ్బీఐ , రష్యా, వికీలీక్స్ అనటం వృథా ప్రయాసే! మన దగ్గర ఈవీఎంల గోల కూడా ఇలాంటిదే! సరిగ్గా వెదికితే ఓటమి అసలు కారణాలు స్పష్టంగానే కనిపిస్తాయి…