అల్లుడి కాళ్లు కడుగుతూ గుండెపోటుతో కుప్పకూలిన మామ
posted on Feb 24, 2023 5:50AM
వాన రాకడ.. ప్రాణం పోకడ ముందుగా తెలియదంటారు.ఇదంతా గతం. వర్షం ఏ సమయంలో ఏ ప్రాంతంలో కురుస్తుందో కచ్చితంగా చెప్పే సాంకేతిక పరిజ్ణానం అందుబాటులోకి వచ్చింది.
అలాగే వైద్య విజ్ణానం కూడా చాలా అభివృద్ధి చెందింది. చిన్న చిన్న పరీక్షలతో రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే విజ్ణానం కూడా అందుబాటులోకి వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నాం. అయినా ప్రాణాలను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలోనే నేటికీ మానవుడు ఉన్నాడు. హాయినా నవ్వుతూ ఆనందంగా తిరుగుతున్న వ్యక్తి అంతలోనే గుండెపోటుతో కుప్ప కూలిపోతున్నాడు.
వయస్సుతో సంబంధం లేకుండానే గుండె పోటుకు గురి అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా పచ్చటి పెళ్లి పందిట్లో వధువు తండ్రి గుండెపోటుతో కుప్పకూలిన సంఘటన విషాదాన్ని నింపింది. కుమార్తె వివాహంలో వరుడి కాళ్లు కడుగుతూ ఓ తండ్రి గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల గుండెలను పించేస్తోంది. మాటలు రాని విషాదమంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.