పోస్కో.. ఎవరికెంతో తెలుసుకో! విశాఖ ఉక్కుకు పెద్దల తుప్పు?
posted on Feb 11, 2021 @ 1:06PM
మీ ఇంట్లో మీకో ఐరన్ షాప్ ఉందనుకోండి. ఆ షాపులో సగ భాగం మీకు పోటీగా ఇంకొకరు ఐరన్ షాప్ పెట్టుకునేందుకు మీరు పర్మిషన్ ఇస్తారా? ఇవ్వనే ఇవ్వరు కదా. మీరే కాదు ప్రపంచంలో ఎవరూ ఆ పని చేయరు. కానీ, కేంద్రం, రాష్ట్రం, విశాఖ ఉక్కు కర్మాగారం కలిసి ఆ పిచ్చి పని చేసేశాయి. ఆ తెలివి తక్కువ నిర్ణయం వెనుక కొందరు తెలివైన పెద్దలకు బోలెడు లాభముందని అంటున్నారు. కేంద్రం, రాష్ట్ర పాలకుల కనుసన్నల్లో.. విశాఖ ఉక్కును మొత్తానికి మొత్తంగా కాజేసే కుట్ర దాగుందని అనుమానిస్తున్నారు. 2 లక్షల కోట్ల విలువైన భూములను అప్పనంగా కొట్టేసే కుతంత్రమంటూ ప్రచారం. కొన్ని వేల కుటుంబాలను రోడ్డున పడేసే ఆ పాపం వెనుక మహా మంత్రాంగమే నడిచిందని చెబుతున్నారు. కొన్ని ఒప్పందాలు, అవి జరిగిన తేదీలు చూస్తుంటే ఈ అనుమానం మరింత బలపడుతోంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ విషయం ముఖ్యమంత్రి జగన్ కు ముందే తెలుసని.. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతోందనేందుకు అనేక ఆధారాలు చూపిస్తున్నారు. రాజ్యసభలో కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన లిఖిత పూర్వక వివరణతో మరింత క్లారిటీ వచ్చేసింది.
పోస్కో వెనక పక్కా ప్లాన్ !
ఉక్కు కర్మాగారానికి విశాఖలో 22వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సగం మేర కర్మాగార నిర్మాణం ఉంది. మిగతా సగం ఖాళీ భూముల్లో విశాఖ ఉక్కు కంపెనీకి పోటీగా మరో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ ముందుకొచ్చింది. భూమండలం మీద ఇంకెక్కడా స్థలమే లేదన్నట్టు.. అప్పటికే ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి పోటీగా.. ఆ సంస్థ భూముల్లోనే పాగా వేసేందుకు రెడీ అయింది. అందుకు, కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విడ్డూరం. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ సమయానికి జగన్ సీఎంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలీకుండా ఈ ఒప్పందం జరిగే అవకాశమే లేదు. అంటే, జగన్ కు తెలిసే.. పోస్కో వైజాగ్ లో ఎంట్రీ ఇచ్చిందనేగా అర్థం? అందుకు తగిన ఆధారాలు కూడా చూపుతున్నారు.
అంతా ఆయనే చేశారా?
2019 మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 21న సీఎం జగన్మోహన్ రెడ్డిని పోస్కో ప్రతినిధులు కలిసినట్టు నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. అదే నిజమైతే.. ఈ తేదీలను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే.. 2019 జూన్ 21న జగన్ తో పోస్కో ప్రతినిధుల సమావేశం.. ఆ తర్వాత నాలుగు నెలలకే.. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అగ్రిమెంట్. ఆశ్చర్యకరంగా లేదూ ఈ డీల్. అంటే.. జగన్ కు తెలిసే.. జగన్ ను కలిసే.. జగన్ తో చర్చించాకే.. విశాఖలో పోస్కో పునాది రాయి వేసిందంటున్నారు విశ్లేషకులు. ఇదంతా.. తమకు తెలీదని ప్రభుత్వం తప్పించుకోడానికి లేదు. ఎందుకంటే.. 2020 అక్టోబరు 29న జగన్ ను క్యాంప్ కార్యాలయంలో.. పోస్కో సీఎండీ పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులు అధికారికంగా కలిశారు. పోస్కో ప్రతినిధులతో సమావేశం తర్వాత ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పోస్కో ముందుకు వచ్చిందని ప్రకటించింది. అంటే, పోస్కో మీద రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతమైన ప్రేమ ఉన్నట్టేగా..? పోస్కో జగన్‌రెడ్డిని కలిసిన రెండు రోజుల తరువాత 2020 అక్టోబర్ 31న.. పోస్కో కోసం సీఎం జగన్ విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘ నాయకులతో మాట్లాడారని చెబుతున్నారు. పోస్కోకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరగా అందుకు కార్మికులు తిరస్కరించారు.
నష్టాల సాకు.. భూములపై సోకు!
సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఢిల్లీ స్థాయిలో పావులు కదిలాయని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది కేంద్రం. కుక్కను చంపాలంటే ముందుగా దాని మీద పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలంటారు. అప్పుడిక పని మరింత సులువవుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ అదే జరుగుతోంది. 2019 నాటికి 95 కోట్ల లాభంతో నడుస్తోంది RINL. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ తగ్గింది. ఆ ప్రభావం విశాఖ స్టీల్ మీదా పడింది. అన్ని కంపెనీల మాదిరే దీనికీ నష్టాలు తప్పలేదు. ఇది సాకుగా చూపించి మొత్తానికి మొత్తం గంప గుత్తగా అమ్మేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ లో కేంద్రం వంద శాతం ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా ఇనుప గనులు కేటాయిస్తే.. మంచి లాభాల్లో నడవడం ఖాయం. పక్కనే ఒడిషా, చత్తీస్ గఢ్ లో ఐరన్ ఓర్ ఉన్నా వాటిని కేటాయించడానికి అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయని చెబుతున్నారు. ఆ అదృశ్య శక్తులు ఇంకెవరు..?
విశాఖ ఉక్కు కర్మాగారం ఖాళీ భూములను పోస్కోకు కేటాయించడంపైనే విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఇక RINLను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించడం మరింత వివాదాస్పదంగా మారింది. పక్కనే ఇంటర్నేషనల్ కంపెనీ పోస్కోను పెట్టుకొని.. దానికి పోటీగా RINLలో వాటాలు ఎవరు కొంటారు? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సైతం పోస్కో పరం కావాల్సిందేగా? అంటే.. ముందుగా పోస్కోను రంగంలోకి దించి.. ఉక్కు కంపెనీ పక్కలో బల్లంలా ఉంచి.. విశాఖ ఉక్కు కంపెనీని పూర్తిగా కబ్జా చేసేలా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగిందనేది కార్మికుల అనుమానం. విలువైన భూములను కొట్టేసేందుకే ఇంతటి స్కెచ్ వేశారని అరోపిస్తున్నారు. 22వేల ఎకరాల్లో విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరించి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దీని విలువ కేవలం 2వేల కోట్లు మాత్రమే. కానీ, బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ 2 లక్షల కోట్లకు పైనే. ఇంత ఖరీదైన భూములను, ప్రైవేటీకరణ పేరుతో అతితక్కువ ధరకు కాజేసే ప్రయత్నం జరుగుతోందనేది విపక్షాల మాట. ఈ డీల్ వెనుక జగన్ రెడ్డి, పోస్కో మధ్య పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో నడిచిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటికే ఆరోపించారు. మరి, ఇందులో నిజమెంతో ఆ జగన్ కే ఎరుక..!