Read more!

తూర్పు తీరంలో ఉక్కు రాజ'కీ'యం

విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర రాజకీయాలను అమాంతం మార్చేయబోతోందా? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పొలిటికల్ ఈక్వేషన్స్ తారుమారు కాబోతున్నాయా? కార్మికులు, స్థానికుల ఉక్కు పిడికిలితో అధికార పార్టీకి ఇక పాతరేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఉక్కు ఉద్యమంతో ప్రతిపక్ష టీడీపీ అనూహ్యంగా బలపడుతోంది. తెలుగు తమ్ముళ్ల చిత్తశుద్ధికి ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోంది. 

టీడీపీ ఉక్కు పిడికిలి..
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంతో బీజేపీ, వైసీపీలు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయాయి. పైకి పాజిటివ్ ప్రకటనలు చేస్తున్నా.. ఆ పాపమంతా ఆ రెండు పార్టీలదేనని ప్రజలంతా నమ్ముతున్నారు. అందుకే.. కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డికి నిరసన సెగ తగిలింది. మరోవైపు.. ప్రజాభిప్రాయానికి, ప్రజాపోరాటానికి టీడీపీ మద్దతుగా నిలుస్తోంది. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కోసం.. చంద్రబాబు ఆదేశాలతో తెలుగు తమ్ముళ్లంతా పోరుబాట పట్టారు. కేంద్ర నిర్ణయం వెలువడిన వెంటనే మొదట రంగంలోకి దిగింది టీడీపీ నేతలే. ఎమ్మెల్యే వెలగపూడి రామక్రుష్ణ కార్మికుల పక్షాన బలంగా నిలిచారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కమిట్ మెంట్ తో.. ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం, ఆదరణ మరింత పెరిగింది. ప్రజాపక్షాన నిలిచే పార్టీ.. కేవలం తెలుగుదేశమేనని మరోసారి తెలిసొచ్చింది. 

ముందునుంచీ విశాఖ వాసులు టీడీపీని ఆదరిస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. విశాఖ తూరు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ నాలుగు దిక్కులా.. నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశమే గెలుచుకుంది. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్. ఒక్క విశాఖ మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర యావత్తూ టీడీపీకి కంచుకోటే. అచ్చెంనాయుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడు లాంటి హేమాహేమీ లీడర్లు టీడీపీకి సొంతం. చంద్రబాబు నాయకత్వంలో వాళ్లంతా ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటున్నారు. కేసులకు బెదరకుండా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖ ఉక్కు విషయంలోనూ అదే చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. ఆందోళనలతో ఢిల్లీ దిగొచ్చేలా ఉద్యమం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ముందు టీడీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. పసుపు జెండా నీడనే.. కార్మికులు, స్థానికులు ఉక్కు పిడికిలి బిగించి.. మోదీకి వినిపించేలా బిగ్గరగా నినదిస్తున్నారు. 

ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకో..
ఉక్కు ఉద్యమ ప్రభావం ఒక్క విశాఖ మీదే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుంది. మూడు జిల్లాలతో ఉక్కు కర్మాగారానికి విడదీయరాని అనుబంధం. యావత్ ఆంధ్రప్రదేశ్ కు మానసిక బంధం. లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆధారపడుతున్నారు. అందుకే, విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. ఈ సెంటిమెంట్ ను పాలకులు మరిచినా.. ప్రతిపక్ష పార్టీ మాత్రం ఫాలో అవుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గతంలో కాస్త సందిగ్థంలో పడిన టీడీపీ.. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. రాజధాని పేరుతో అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆ పార్టీ ఉదాసీన వైఖరితో ప్రజలు వైఎస్సార్ సీపీని అసహ్యించుకుంటున్నారు. పాలకులపై తిరగబడే పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. ఒకవైపు అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంటే.. అదే సమయంలో ప్రతిపక్షానికి ప్రజాదరణ పెరుగుతోంది. 

సరైనోడు..

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వాడే సరైన నాయకుడు. ఈ విషయంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. సమయానికి తగ్గట్టు సరిగ్గా వ్యవహరించేవారే నెగ్గుకురాగలరు. ప్రస్తుతం చంద్రబాబు ఇలాంటి వ్యూహమే ఫాలో అవుతున్నారు. కరోనా, లాక్ డౌన్ టైమ్ లో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినా.. అది సరైన సమయం కోసం వేచి చూసే ధోరణి అని చాలా తక్కువ మందికే తెలుసు. జూమ్ మీటింగులంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేసినా పెద్దాయన పట్టించుకోలేదు. ఎప్పుడైతే దళితులపై దాడులు, ఆలయాల విధ్వంస ఘటనలు, టీడీపీ నేతలపై కేసులు, దాడులు జరిగాయో అప్పటి నుంచీ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దిగిపోయారు. జూలు విదిల్చిన సింహంలా వేటకు రెడీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోతే.. ముందుముందు ఉక్కు ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. గతంలో ఏపీకి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలతో మోదీ సర్కారుపై దండెత్తిన చరిత్ర ఆయనది. అక్రమాలకు ఎదురొడ్డి పోరాడే తెగువే ఆయన సొంతం. తాజాగా.. ఆంధ్ర ప్రజల పక్షాన ఉక్కు పోరాటంపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అదేంటో.. ఆయన మదిలో ఉన్న వ్యూహమేంటో త్వరలోనే తెలుస్తుంది. విశాఖ కేంద్రంగా ఉక్కు ఉద్యమంతో.. ఇక తూర్పు తీరంలో తెలుగుదేశానికి తిరుగుండదు. పూర్వ వైభవం తిరిగిరావడం ఖాయం..