విజయసాయిపై చర్యలకు జగన్ జంకెందుకు?
posted on Oct 14, 2022 @ 11:42AM
విశాఖ భూముల వ్యవహారంలో సందేహాలకు తావు లేకుండా విజయసాయి అక్రమాలు పత్రికలలో ప్రచురితమౌతుంటే.. జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు. పైగా మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీ ఎంపీ భూ దందాలకు సంబంధించిన లీకులు ఇస్తుంటే.. జగన్ విజయసాయిపై చర్య తీసుకోకుండా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు.
అన్నిటికీ మించి మీడియాలో వెలుగు చూస్తున్న వార్తలకు వైసీపీ వర్గాల నుంచి, మరీ ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వస్తున్న లీకేలే ఆధారమని కూడా చెబుతున్నారు. అసలు ఇటీవలి కాలంలో విజయసాయికి పార్టీలో ప్రాధాన్యత బాగా తగ్గింది. ఆయన నుంచి ఒక్కటొక్కటిగా అన్ని పదవులూ అధికారాలనూ తొలగించి దాదాపుగా ఒక ఉత్సవ విగ్రహంగా మార్చేశారు. వైసీపీకి బలం బలహీనత కూడా అయిన సోషల్ మీడియా అధికారాలను కూడా విజయసాయి నుంచి ఊడబీకి.. సజ్జల కుమారుడికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇలా ఇటీవలి కాలంలో తాడేపల్లి ప్యాలస్ కూ విజయసాయికి మధ్యా గ్యాప్ బాగా పెరిగిందన్న సంగతి బహిరంగ రహస్యమే. అయితే ఇన్ని విధాలుగా విజయసాయిని పక్కన పెట్టిన జగన్ ఆయనపై పార్టీ పరంగా ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నది మాత్రం అంతుపట్టని ప్రశ్నగా మారిపోయింది.
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణపై సస్పెన్షన్ వేటు వేసిన జగన్ అదే రీతిలో విజయసాయిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదన్నది ఇప్పుడు వైసీపీ వర్గాలలోనే వినిపిస్తున్న ప్రశ్న. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న నెపంతో మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసిన జగన్.. మరి సొంత పార్టీ ఎంపీపై మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేసిన విజయసాయిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నదానిపై పరిశీలకులు కూడా పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు.
ముఖ్యంగా హస్తినలో బీజేపీ పెద్దల గుడ్ లుక్స్ లో ఉండటం వల్లనే విజయసాయిపై చర్యలకు జగన్ జంకుతున్నారని అంటున్నారు. ఆ విషయం విస్పష్టంగా తెలిసినందునే విజయసాయి కూడా జగన్ ఆగ్రహానికి గురైతానన్న జంకు లేకుండా విశాఖలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ స్వంత పార్టీ ఎంపీపైనే విమర్శలు, ఆరోపణలు గుప్పించే ధైర్యం చేశాడని అంటున్నారు. అదే ధైర్యంతోనే జగన్ సొంత కుటుంబానికి చెందిన చానెల్ పై కూడా అన్యాపదేశంగా విమర్శలు గుప్పించి, తానే స్వయంగా ఒక చానెల్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇక వైసీపీతో తెగతెంపులు చేసుకునే నిర్ణయానికి విజయసాయి వచ్చేశారనడానికి ఇదే నిదర్శనమని కూడా పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా పార్టీ అధినాయకత్వంపై ధిక్కా స్వరం వినిపించిన వారికి వారంతట వారే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఏ పార్టీ అధిష్ఠానం ఇవ్వదు. పార్టీయే సదరు నాయకుడిని ఎక్స్ పెల్ చేయడమో, బహిష్కరించడమో.. కనీసం సస్పెండ్ వేటు వేయడమో చేస్తుంది. ఈటల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసింది కూడా అదే.
మరి విజయసాయి విషయంలో మాత్రం జగన్ చర్యలకు వెనకాడుతున్నారు. ఆ బలహీనతను ఆసరా చేసుకునే సొంత చానెల్ అంటూ విజయసాయి ప్రకటనలు చేయడమే కాకుండా.. పార్టీ తీరునే తప్పుపట్టే విధంగా మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారు. దీనిపైనే పార్టీ వర్గాలలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ గుట్టుమట్లన్నీ తెలిసిన విజయసాయిపై చర్య తీసుకుంటే మొదటికే మోసం వస్తుందన్న భయం జగన్ ను వెంటాడుతోందా అన్న అనుమానాలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతున్నాయి.
అలాగే సుదీర్ఘ కాలం పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయికి పార్టీలోని పలువురు నాయకులు, కింది స్థాయి క్యాడర్ తో ఉన్న సత్సంబంధాలు కారణంగా విజయసాయిపై చర్య తీసుకుంటే పార్టీలో చీలిక వస్తుందన్న భయం జగన్ ను వెంటాడుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద విజయసాయి జగన్ కు కొరకరాని కొయ్యలా మారిపోయారన్న భావన అయితే పార్టీ శ్రేణుల్లో నెలకొని ఉందని అంటున్నారు. దీనికి అదనంగా విజయసాయికి బీజేపీకి చెందిన అగ్ర నాయకత్వంతో ఉన్న సంబంధాలు కూడా జగన్ ను నియంత్రిస్తున్నాయని అంటున్నారు.