Read more!

సమాజసేవ ఎందుకు చేయాలి? దానికి అవసరమైనది ఏంటి?

ధైర్యానికి బలం అవసరం లేదు. ధైర్యం శారీరక బలం మీద ఆధారపడి లేదు. అది మనస్సుకు సంబంధించినది. ధైర్యానికి ఆలంబన శారీరక బలమే అయితే పులి, సింహం, ఏనుగు లాంటి అడవి జంతువులు ఈ ప్రపంచాన్ని ఏలి ఉండేవి. కానీ వాటి ముందు సోదిలోకి కూడా రాని మనిషి చిన్న కర్రపుల్లతో వాటిని ఆడిస్తున్నాడంటే బలం అనేది శారీరక పరిమాణంలోగానీ, దేహ దారుఢ్యంలోగానీ లేదని అర్ధమవుతోంది. పిరికితనాన్ని దరి చేరనివ్వకపోవడమే ధైర్యం. నిస్సహాయ స్థితిలో కూడా నీరుగారిపోకుండా ఉండడమే ధైర్యం. ధనవంతుడు ధైర్యవంతుడు కాదు. ధైర్యవంతుడే ధనవంతుడు.

ధైర్యవంతులంటే క్రూరమృగాలను చంపినవారో, ఖూనీలు చేసినవారో కాదు. ఒక మంచిపని కోసం ముందు నిలిచిన వారు. పరిస్థితులు ఏవైనప్పటికీ, సహకరించేవారూ, అనుసరించే వారూ లేకపోయినప్పటికీ అనుకున్న కార్యం కోసం కార్యరంగం లోకి దూకినవారు. ఉత్తమ లక్ష్య సముపార్జనలో పూర్వాపర విపరిణామాలను లక్ష్యం చేయనివారు. కొల్లాయి ధరించిన గాంధీజీ ధనికుడు కాదు. బలాఢ్యుడసలే కాదు. భవిష్యత్తులో ఇంతమంది తనను అనుసరిస్తారనే భరోసా కూడా లేదు. ఆయన ధ్యేయం స్వాతంత్ర్య సముపార్జన. అంతే! మదర్ థెరెసా ఓ సామాన్య స్త్రీ. భారతదేశంలోని నిరుపేదలకూ, నిర్భాగ్యులకూ సేవ చేయాలనే ఆమె అంకితభావం ముందు ఏ అననుకూల పరిస్థితి నిలబడలేదు. స్వామి వివేకానంద ఘన చరిత్ర జగమెరిగినదే. విజయాలన్నిటా ఆయన ఆయుధం ధైర్యమే. ఆయన ప్రపంచానికిచ్చిన సందేశం కూడా అదే!

మన దేశంలోని స్త్రీలు ఎంతో ధైర్యవంతులు. శారీరక దుర్భలత్వం వారి దృష్టిలోకే రాదు. బిడ్డలను పెంచే అత్యంత సుకుమారమైన లాలనల నుండి దేశాన్నేలే కఠినతరమైన కార్యాల వరకూ నిర్వహించే సామర్థ్యమున్న ధీశాలురు. కష్టనష్టాల కారణంగా కుటుంబం మొత్తం క్రుంగిపోయి ఉన్న సమయాలలో ఆ ఇంటి ఇల్లాలే ధైర్యంగా నిలబడి కుటుంబానికి ధైర్యం  నూరిపోస్తుంది. ఆ సంకట స్థితిని ఎదుర్కొనే స్ఫూర్తి కలిగిస్తుంది. కొత్త ఊపిరిలూదుతుంది. బిడ్డను కబళించడానికి వచ్చిన పులిని అచ్చు ఆడపులి లాగే ఎదుర్కొంటుంది స్త్రీ. నిజమైన పురుషత్వం ధైర్యమే! ధీరత్వమే! రాణీ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి స్త్రీ రత్నాలు శత్రువులకు సింహస్వప్నం అయ్యారంటే దానికి కారణం వారి కత్తులకున్న పదును కాదు, గుండెల్లోని ధైర్యం!

అన్ని రకాలుగా అన్ని  కోణాల్లో ఈ సమాజానికి మనమెంతో సేవ చేయవలసి ఉంది. ఈ బాధ్యత మనం కొత్తగా తెచ్చిపెట్టుకోవలసినది కాదు. బరువుగా నెత్తికెత్తుకోవలసినది కాదు. జన్మతః వచ్చిన వారసత్వం. గౌరవంగా స్వీకరించ వలసిన కర్తవ్యం. ఈ కర్తవ్యం నెరవేర్చడానికి మనం పురుషులమా, స్త్రీలమా అనేది ప్రశ్నే కాదు. ధనికులమా, పేదలమా? బలాఢ్యులమా, బలహీనులమా? అన్న ప్రసక్తే లేదు. మనం మనుషులం, ఈ దేశ పౌరులం. అంతే! ఈ దేశం మన కుటుంబం అనుకుని ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందడుగేయాలి .


                                            *నిశ్శబ్ద.