Read more!

సంతోషమైన జీవితానికి తొలిమెట్టు మానసిక ఆరోగ్యమే..

మానసిక ఆరోగ్యం సరిగాలేని వ్యక్తులను పిచ్చివాళ్లంటూ హేళన చేస్తుంది ఈ సమాజం. అందరిలో కలిసేందుకు అనర్హులన్నట్టుగా వెలివేస్తుంది. ఇక మానసిక ఆరోగ్యం బావుంటే ఆత్మవిశ్వాసం వెన్నెంటే ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ఆత్మస్థైర్యం తొణికిసలాడుతుంది. అంతేనా ఒత్తిడి ఆమడ దూరం పారిపోతుంది. మనిషి సాధారణ జీవితానికి ఎంతో ముఖ్యమైన మానసిక ఆరోగ్యాన్ని ఒక సాధారణ అంశంగా పరిగణించడం, మానసిక రుగ్మతలపై అవగాహన పెంపొందించడమే ముఖ్యొద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 10న ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని’ నిర్వహించాలని 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రకటించింది. దీని వెనుక చరిత్ర ఏంటి? మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చెయ్యాలి? తెలుసుకుంటే..

మానసిక ఆరోగ్యంతో జీవించడం పట్ల సరైన విజ్ఞానం, సంబంధిత సమస్యలపై అవగాహన కోసం ఉద్దేశించిన ‘ప్రపంచ మానసిక దినోత్సవాన్ని’ తొలుత ప్రత్యేక థీమ్ ఏమీ లేకుండానే నిర్వహించేవారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో వస్తున్న విశేష స్పందనను పరిగణలోకి తీసుకొని 1994 నుంచి ప్రత్యేక థీమ్‌తో వేడుకలు నిర్వహించడం మొదలుపెట్టారు. ‘ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచుకుందాం’ అనే తొలి థీమ్‌తో 1994లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి ఏడాదీ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది.

అవగాహన పొందడం చాలా ముఖ్యం..

ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ చాలామంది ఒత్తిడిలో కూరుకుపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తుంటాయి. ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా చాలానే వెలుగుచూశాయి. ఈ విధంగా ఎందరో ప్రముఖులు సైతం తమ జీవితాలను కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాన్ని మానసిక అనారోగ్యం నాశనం చేస్తోంది. మ‌హిళ‌లు, పురుషులు, చిన్నా-పెద్దా అనే భేదం లేకుండా ఎంతోమందిని కుంగుబాటుకు గురిచేస్తోంది. అయితే.. వారిలో ఎంతమందికి వైద్యం అందుతోందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించాలన్నా, వైద్యం అందాలన్నా అవగాహన కలిగివుండడం చాలా ముఖ్యం. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతి ఏడాది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

నిజానికి బాధ‌, కోపం, నిరాశ, ఆందోళ‌న లాంటి భావోద్వేగాలు అందరికీ ఉంటాయి. అయితే డిప్రెష‌న్ బాధితుల్లో ఇవి దీర్ఘ‌కాలం కనిపిస్తాయి. వీటిని గుర్తించి జీవితాన్ని ప్ర‌భావితం చేయకముందే వైద్యులను సంప్రదిస్తే మేలు జరుగుతుంది. లేదంటే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వారు మన చుట్టూ మనతోపాటే ఉండొచ్చు. అలాంటి వారికి సరైన అవగాహన కల్పించడం ద్వారా వారి జీవితాన్ని కాపాడవచ్చు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే. దీనికి అనుగుణంగా ఈ ప్రత్యేకమైన రోజున మానసిక ఆరోగ్యంపై అవగాహన పొందాలి, నలుగురికి అవగాహన కల్పించాలి. ఎవరైనా డిప్రెషన్ లో ఉంటే వారికి మానసిక ధైర్యం, సమస్యను ఎదుర్కొనే మార్గం సూచించాలి. మీతో మేమున్నామనే నమ్మకం వారికి కల్పించాలి. ఇలా చేస్తే ఈ ప్రపంచ మానసిక దినోత్సవానికి సార్థకత చేకూర్చినట్టు అవుతుంది. . 

మానసిక ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకోవడానికి  ఈ కింది నాలుగు అంశాలు రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. తద్వారా హార్మోన్లను నియంత్రిస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది.


పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మానసిక శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 


సరైన నిద్రకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే నిద్ర గొప్ప ఔషధం. ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది. 


సానుకూల దృక్పథంతో ఆలోచించడం వల్ల డిప్రెషన్ ను జయించవచ్చు. ఏ విషయాన్ని అయినా అన్ని కోణాల నుండి ఆలోచించాలి. నెగిటివ్ గా మాట్లాడేవారికి కూడా దూరంగా ఉండాలి.


*నిశ్శబ్ద.