మీరు కూడా చిన్న విషయాలకే కోప్పడుతుంటారా? ఇది మీ కోసమే..!
posted on Aug 21, 2025 @ 11:35AM
నేటి కాలంలో నడుస్తున్న బిజీ, ఒత్తిడితో కూడిన జీవితంలో చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటం లేదా స్నేహితుల మాటలకు వెంటనే కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చాలా మంది అనుభవిస్తూ ఉంటారు. అయితే కోపం అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పదే పదే కోపం రావడం అనేది అధిక రక్తపోటు, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది మానవ సంబంధాలను, వృత్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల కోపాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
అయితే కోపాన్ని నియంత్రించుకోవడం కూడా ఒక గొప్ప నైపుణ్యం అనే చెప్పవచ్చు. కోపాన్ని అదుపు చేసుకోవడం అంటే కోపాన్ని పూర్తిగా అణచివేయడం కాదు, దానిని వ్యక్తీకరించే విధానం కావచ్చు, దానిని ప్రదర్శించే ప్రాంతం కావచ్చు.. వీటిని మార్చుకోవడం. ముఖ్యంగా కోపానికి గల కారణాలను అర్థం చేసుకుని, దానిని నియంత్రించుకోవడానికి పద్ధతులను అవలంబించినప్పుడు భావోద్వేగాలపై మంచి నియంత్రణను కలిగి ఉండగలుగుతాము. కోపాన్ని నియంత్రించుకునే పద్దతులు ఏంటో తెలుసుకుంటే..
ట్రిగ్గర్ లు..
కోపాన్ని నియంత్రించుకోవాలనుకుంటే,మొదట చేయాల్సింది ఎందుకు కోపం వస్తుంది? ఎవరి వల్ల కోపం వస్తుంది? ఎలాంటి పరిస్థితులలో కోపం వస్తుంది? ఈ విషయాలను అర్థం చేసుకోవాలి.
కొన్నిసార్లు పని ఒత్తిడి కావచ్చు లేదా ఒక వ్యక్తి కావచ్చు, కొన్నిసార్లు రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతం కావచ్చు. దేని వల్ల కోపం వస్తుందనేది గుర్తించగలిగితే ఆ కోపాన్ని నియంత్రించడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.
శ్వాస సాధన..
కోపం వచ్చినప్పుడల్లా వెంటనే స్పందించే బదులు కొద్ది సేపు ఆగి లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయాలి. ఈ టెక్నిక్ శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. హృదయ స్పందనను సాధారణీకరిస్తుంది. ఆలోచించడానికి సమయం ఇస్తుంది. నెమ్మదిగా ఉచ్ఛ్వాసము, నిశ్వాసము కోపాన్ని తక్షణమే నియంత్రించగలవు.
పరిస్థితి నుండి దూరం..
ఏదైనా పరిస్థితి చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రదేశం నుండి కొంత సమయం దూరంగా వెళ్లడం మంచిది. తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడటం లేదా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం చేయాలి. దూరాన్ని సృష్టించడం వల్ల పరిస్థితిని కొత్త కోణం నుండి చూసే అవకాశం లభిస్తుంది. ఇది కోపాన్ని శాంతపరుస్తుంది.
వ్యాయామం, ధ్యానం..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కోపాన్ని నియంత్రించడానికి సులువు అవుతుంది. శారీరక శ్రమ.. ఒత్తిడిని, కోపాన్ని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనితో పాటు ధ్యానం, యోగా సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా చిన్న విషయాలకు స్పందించడం మానేస్తారు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...