శరీరం మీద బొబ్బలు, మొటిమలు ఎందుకు వస్తాయి? దీని వెనుక అసలు కారణాలు ఇవి..!
posted on Aug 20, 2025 @ 12:46PM
బొబ్బలు, మొటిమలు చాలా సాధారణ సమస్య. ఇది తరచుగా కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది. శరీరంపై బొబ్బలు, మొటిమలు ఉండటం ఒక సాధారణ విషయం. కానీ సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే వీటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బొబ్బలు ఎరుపు, వాపు, చీముతో ఉంటాయి. అలాగే మొటిమలు కూడా పదే పదే రావడం, చీము, రక్తం రావడం వంటివి జరుగుతుంటాయి. ఇవి ఆరోగ్యం గురించి అనేక ముఖ్యమైన సూచనలను ఇస్తాయి.
బ్యాక్టీరియా మన రంధ్రాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసినప్పుడు బొబ్బలు, మొటిమలు ఏర్పడతాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ ఈ ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల వాపు, చీము ఏర్పడుతుంది. అయితే బాక్టీరియా మాత్రమే దీనికి కారణమని చెప్పలేం. అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, పర్యావరణ కారకాలు కూడా బొబ్బలు, మొటిమల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ కారణాలను తెలుసుకుని వాటిని నివారించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న మూడు అతిపెద్ద కారణాలను తెలుసుకుంటే..
వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం..
మొటిమలు, బొబ్బలకు అతి పెద్ద కారణం వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం. శరీరాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోనప్పుడు, చర్మంపై నూనె, చెమట, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఈ బాక్టీరియా చర్మ రంధ్రాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. దీని వలన బొబ్బలు, మొటిమలు వస్తాయి. అందువల్ల క్రమం తప్పకుండా స్నానం చేయడం, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ..
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే శరీరం బయట బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములతో సరిగ్గా పోరాడదు. డయాబెటిక్ రోగులు లేదా చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కురుపులకు ఎక్కువగా గురవుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.
జీర్ణ ప్రక్రియ వల్ల బొబ్బలు వస్తాయి..
జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు శరీరం ఆహారం నుండి టాక్సిన్లను పూర్తిగా తొలగించలేకపోతుంది. ఈ విషపదార్థాలు రక్తంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. శరీరం చర్మం ద్వారా వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో ఈవిషపదార్థాలు చర్మ రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్, బొబ్బలు లేదా మొటిమలు ఏర్పడతాయి.
హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి..
పైన మూడు ప్రధాన కారణాలతో పాటు బొబ్బలు, మొటిమలు రావడానికి మరొక కారణం ఉంది. అది హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా కౌమారదశలో మొటిమలకు ప్రధాన కారణం. దీనితో పాటు ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ వంటి హార్మోన్లను కూడా పెంచుతుంది. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోయి బొబ్బలు ఏర్పడతాయి. ఒత్తిడిని నియంత్రించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
నివారణకు అవసరమైన జాగ్రత్తలు..
కురుపులను నివారించడానికి చర్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగాలి. ఈ సమస్యను పదే పదే ఎదుర్కుంటుంటే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది ఏదైనా అంతర్గత వ్యాధికి సంకేతం కావచ్చు.
రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...