Read more!

మనసుకు ఏకాగ్రత ఎందుకు ముఖ్యమంటే..!

మనిషి మనస్సు అనేక రకాల శక్తుల కోశాగారం. సాధారణంగా మన మనస్సుకుండే అపారమైన శక్తిని మనం అంచనా వెయ్యలేం. ఎందుకంటే మామూలుగా మనస్సు చంచలమైనది. నిలకడ లేనిది. మన మనస్సు ఏకాగ్రమైనప్పుడు దానికున్న శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. విజ్ఞాన రంగంలోని ప్రతీ పరిశోధనా మనస్సును ఏకాగ్రపరిచి చేసిన కృషికి ఫలితమే! అందుకే జీవితంలో ఏ రంగంలోనైనా సాఫల్యం పొందాలంటే ముందుగా మనస్సును ఏకాగ్రం చేయాలి. మనం మనస్సును ఏకాగ్రపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రారంభంలో ఇంకా చంచలమైపోయినట్లు కనిపిస్తుంది. దానితో భయపడిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాం. అయితే మనస్సు స్వభావమే అది. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు మనస్సు యొక్క అసలైన స్వరూపం అవగతమవుతుంది.

మన ఆలోచనల నిరంతర ప్రవాహమే మనస్సు.  పై నుంచి కిందకు ప్రవహిస్తున్న నీటి ధారను ఊహించండి. పై నుంచి చూస్తే దాని వేగం గురించి మనకు తెలియదు. కానీ ఆ ధారను మనం దేనితోనైనా ఆపడానికి ప్రయత్నిస్తే దాని వేగం గురించి మనకు తెలుస్తుంది. కట్టలు తెగిపోయినప్పుడు తెలుస్తుంది ఆ నీటి ప్రవాహానికి ఎంత తీవ్రత ఉందో.  అలాగే మన మనస్సును  ఏకాగ్రం చేసుకోవడం కూడా. ఈ ప్రయత్నంలో మనస్సు మొదట ఇంకాస్త విచలితమవుతుంది. ఆ సమయంలో "ఇంతకు మునుపు మనస్సు ఇంత చంచలంగా లేదు" అనుకుంటాం. ఒక సరోవరంలోని నీరు నిర్మలంగా, స్వచ్ఛంగా కనిపిస్తుంది. అయితే దాని అడుగున అంతా బురద ఉంటుంది. ఒక చిన్న రాయి నీటిలోకి విసిరితే చాలు, నీరు నెమ్మదిగా బురద రంగులోకి మారుతుంది. మనం ఆ సరోవరంలోని బురదను పైకి తీసి సరోవరాన్ని శుభ్రం చేద్దామనుకుంటే  బురద తీస్తున్న కొద్దీ ఆ నీరు బురద రంగులోకి మారుతుంది. అప్పుడు ఇంతకు ముందే నీరు బాగుండేది, సరస్సులో నీరు ఇంత బురదగా ఉండేది కాదు అనిపిస్తుంది. బురద తీయడం మానేస్తే మళ్ళీ నీరు నిర్మలం అయిపోతుంది. బురద అడుగుకు చేరిపోతుంది. అయితే ఈ నిర్మలత్వం శాశ్వతం కాదు. మళ్ళీ చిన్న రాయి దానిలో వెయ్యగానే బురద మళ్ళీ పైకి వస్తుంది.

నీరు కుళ్ళు అయినా ఫరవాలేదనుకొని, అడుగున ఉన్న బురద అంతా తీసేస్తే ఒక రోజు అందులో ఉన్న బురద అంతా పోతుంది. అప్పుడు నీరు శాశ్వతంగా శుభ్రమవుతుంది. అడుగున బురద లేదు కనుక, అప్పుడు అందులో రాయి కాదు కదా, ఏనుగు దిగినా కూడా నీళ్ళు స్వచ్ఛంగానే ఉంటాయి.

మన మనస్సు కూడా ఒక సరస్సు లాంటిదే. దాని అడుగు జన్మ జన్మల చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. పై నుంచి నిర్మలంగా ఉన్నట్లుంటుంది. కానీ ఒక చిన్న సంఘటన, చిన్న ఆలోచన, లేక చిన్న మాట, మన మనస్సులో ఉన్న కుళ్ళును బయట పెడుతుంది. జపధ్యానాల లాంటి సాధనలతో మనస్సులో పేరుకున్న కుళ్ళును పోగొడదామని ప్రయత్నించి నప్పుడు సరోవరంలో నీటి లాగే మనస్సు చాలా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో మన మనస్సులో విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే దానికి భయపడి మన ప్రయత్నం మానకూడదు. మనం సరి అయిన మార్గంలో వెళుతున్నామనే నమ్మకంతో ఉండాలి. సరోవరం లాంటి మనస్సు శుభ్రపడుతున్నదనుకోవాలి. మన ప్రయత్నం మానకుండా ఇంకా తీవ్రంగా కృషి చెయ్యాలి. అలా క్రమక్రమంగా మన మనస్సు మునుపటి కన్నా చాలా బాగా అయింది అని మనకే తెలుస్తుంది. అప్పుడు అలాంటి నిర్మలమైన మనస్సును సులువుగా ఏకాగ్రం చేసుకోగలం. ఎక్స్రేలు ఏ విధంగా ధాతు పొరల్ని ఛేదించి వెళ్ళగలవో అలాగే ఏకాగ్రత గల మనస్సు ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఛేదించగలదు. ఏకాగ్రచిత్తం గల వ్యక్తి ఏ విషయం గురించి ఆలోచించినా తక్షణమే దాని సమాధానం కూడా కనుక్కోగలడు. అలా ఏకాగ్రమైన మనస్సు గల వ్యక్తి ఏ రంగంలో అయినా తన అస్తిత్వాన్ని నిరూపించుకోగలడు.


                                    *నిశ్శబ్ద.