Read more!

 సత్యం పలకడం వల్ల వ్యక్తి కూడా గొప్పవాడు అవుతాడు.. ఇదే ఉదాహరణ!

నిజం మనిషిని గొప్పవాడని చేస్తుంది అంటారు. దానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణ. వెయ్యేళ్ళ కిందట జరిగిన ఘటన ఇది! ఆఫ్ఘనిస్తాన్లోని ఓ కుగ్రామం... పశువుల కాపరి అయిన ఓ కుర్రాడు గోధూళివేళ గోవుల్ని పల్లెకు తోలుకెళుతున్న సందర్భం... హఠాత్తుగా మందలోని గోవు మాటలు విని పించాయి. "పచ్చిక బయళ్ళలో పశువులను మేపుతూ ఏం చేస్తున్నావిక్కడ? భగవంతుడు నిన్ను సృష్టించింది ఇందుకు కాదు" అంది ఆవు.

ఒక్కసారిగా ఆ బాలుడు భయంతో ఇంటికి పరుగెత్తి, ఏం చేయాలో తెలియక, ఇంటి పైకెక్కేశాడు. అప్పుడతడికి దూరంగా హజ్ యాత్ర ముగించుకొని అరాఫత్ పర్వతశ్రేణుల నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బృందం కనిపించింది. ఏదో స్ఫురించినట్లుగా ఆ బాలుడు, తల్లి వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు. "నేను పశువులు కాయను. బాగ్దాద్ వెళ్ళి చదువుకుంటాను" అని మనస్సులోని మాటను బయటపెట్టాడు. ఇది దైవాజ్ఞగా భావించిన ఆ మాతృమూర్తి బాలుణ్ణి బాగ్దాద్ పంపడానికి సిద్ధమైంది. నలభై బంగారు నాణాల్ని అతడి కోటు లోపల భద్రంగా కుట్టి పెట్టింది.

కన్నకొడుకుకు కడసారి వీడ్కోలు చెబుతూ, "బాబూ! ఈ క్షణాన నీపై నాకున్న మమకారాన్ని ఆ భగవంతుడి కోసం నాలోనే అణుచుకుంటున్నాను. ఆ విధాత తుది తీర్పునిచ్చేదాకా తిరిగి మనం ఒకరినొకరం చూసుకోగలగడం అసాధ్యం. కానీ ఈ అమ్మ చెప్పే ఒక్కమాట మాత్రం ఎప్పుడూ మరచిపోవద్దు. ఎప్పుడూ నీలో సత్యమే స్ఫురించాలి, సత్యమే మాట్లాడాలి,  నీ జీవితం సంకటస్థితిలో పడినా సరే సత్యమనే మార్గంలోనే పయనించాలి" అని ఆ తల్లి చెప్పింది.

అలా ఆ తల్లి ఆశీస్సులతో ఆ బాలుడు యాత్రికుల బృందంతో బాగ్దాద్ దారి పట్టాడు. ఆ బృందం కనుమల గుండా సాగిపోతుండగా, కొందరు దోపిడీ దొంగలు గుఱ్ఱాల మీద వారిని చుట్టు ముట్టి, కొల్లగొట్టడం మొదలుపెట్టారు. మొదట్లో దొంగలు ఆ బాలుడిపై దృష్టి పెట్టలేదు. చివరకు ఓ దొంగ 'ఏయ్! నీ దగ్గర డబ్బూ దస్కం ఉందా! అది కూడా ఇచ్చేయ్' అంటూ ఆ బాలుడిని బెదిరించాడు. ఆ బాలుడు ఎంతో నిబ్బరంగా 'మా అమ్మ నా కోటు లోపల కుట్టి పెట్టిన నలభై బంగారు నాణాలున్నాయి తీసుకోండి' అన్నాడు. ఆ బాలుడు తమతో పరిహాసం ఆడుతున్నాడనుకొని దొంగలు వెళ్ళిపోయారు.

అప్పుడు మరొక దొంగ అటుగా వచ్చి, అదే విధంగా బాలుడిని ప్రశ్నించాడు. ఆ బాలుడు అతడికీ అదే సమాధానం చెప్పాడు. ఆ దొంగ కూడా ఆ బాలుడు చెప్పే మాటలు పట్టించు కోకుండా వెళ్ళి పోయాడు. చివరకు దొంగలంతా కలసి ఆ బాలుణ్ణి తమ ముఠానాయకుడి దగ్గరకు తీసుకెళ్ళి, "ఈ బాలుడు బిచ్చగాడిలా కనబడుతున్నాడు. కానీ, తన దగ్గర నలభై బంగారునాణాలున్నాయని చెప్పుకుంటున్నాడు" అంటూ ముందుకు తోశారు.

ఆ ముఠానాయకుడు మరోసారి అదే ప్రశ్న వేశాడు.. కానీ ఆ బాలుడి సమాధానంలో మార్పు లేదు. అప్పుడు ఆ నాయకుడు ఆ పిల్లవాడి కోటును కత్తిరించి చూశాడు. బాలుడు చెప్పినట్లే నలభై బంగారు నాణాలు ఉన్నాయి. దాంతో, ఒక్కసారిగా ఆ దొంగల నాయకుడు, ఇతర దొంగలు నిశ్చేష్టులైపోయారు. అన్ని నాణాలు దగ్గర పెట్టుకొని, ఆ రహస్యాన్ని ఎందుకు చెప్పావని దొంగల నాయకుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆ బాలుడు ఎంతో నిర్మలంగా "ప్రాణం పోయినా సరే, నిజమే చెబుతానని మా అమ్మకు మాట ఇచ్చాను. కేవలం ఈ నలభై బంగారు నాణాల కోసం మా అమ్మకిచ్చిన మాట తప్పడం నాకిష్టం లేదు. అందుకనే నిజం చెప్పాను" అన్నాడు.

ఆ మాటలు వింటూనే ఆ దొంగలు ఏడవడం మొదలుపెట్టారు. "నువ్వెంత మంచివాడివి! మీ అమ్మ ఎంత మహోన్నతురాలు! నువ్వు మీ అమ్మ మాటకు కట్టుబడ్డావు.  కానీ మేము మా తల్లితండ్రుల మాటల్ని ఉల్లంఘిస్తూ వస్తున్నాం. దుష్టులుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇంతవరకూ మేము సాగించిన అకృత్యాలకు పశ్చాత్తాప పడుతున్నాం. ఇక నుంచి నీవే మా నాయకుడివి" అంటూ ఆ బాలుడి పాదాలపై పడిపోయారు. సచ్ఛీలురిగా మారిపోయారు.

కఠిన హృదయాలను కరిగించే సత్య సంధత తొణికిసలాడిన ఆ బాలుడు తదనంతర కాలంలో సాధువుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దాడు. అతడే  షేక్ అబ్దుల్ ఖాదర్ అల్ జిలానీ అనే మహనీయ సాధువు. 


                                            *నిశ్శబ్ద.