మునుగోడులో ముగ్గురిలో ముందుండేదెవరో ?
posted on Oct 14, 2022 @ 3:34PM
మూడు పార్టీలకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకే కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియలో ఒక ప్రధాన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు (శుక్రవారం) తో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెరాస అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందుగానే నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. మరోవంక మునుగోడు బరిలో దిగేందుకు ఇప్పటికే 30 మందికి పైగా అభ్యర్ధులు నామినేషన్లు దాఖాలు చేశారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఇంకెంత మంది నామినేషన్ వేస్తారనేది పక్కన పెడితే, ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత ఎంతమంది బరిలో మిగులుతారో చూడవలసి వుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, మునుగోడు బరిలో ఎందరున్నా, ప్రధాన పోటీ మాత్రం తెరాస, బీజీపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్యనే ఉంటుందని పరిశీలకులు ముందు నుంచి చెపుతూనే ఉన్నారు. అయితే, పోటీలో నిలిచే ఇతర పార్టీలు, అభ్యర్ధులను బట్టి, ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములు నిర్నయమవుతాయ్నై అంటున్నారు. పొతే ముగ్గురి మధ్యనే, కానీ, ఫలితాన్ని నిర్ణయించేది మాత్రం, ఇతరులే అంటున్నారు.
అయితే, మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలో దించడంతో ఇతర సామాజిక వర్గాలు ఎలా స్పందిస్తాయనేది, ఆసక్తికరంగా మారింది. బీస్పీపీ తరపున దళిత బహుజన వర్గానికి చెందిన అందోజు శంకరా చారి నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇతర ముఖ్యనేతలు నియోజక వర్గంలోని ఏడు మండలాలలో ప్రచారం సాగిస్తున్నారు.మరో వంక , కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన నామినేషన్ అయితే వేయలేదు. అలాగే, వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ - టీపీ కూడా పోటీ చేస్తుందని ప్రచారం జరిగినా,షర్మిలఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆ ప్రచారం ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాద యాత్రలో ఉన్న, షర్మిల మునుగోడు ఉపఎన్నికలు నేపధ్యంగా తెరాసపై జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగి తేలుతున్నారని ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
అదలా ఉంటే, వివిద సంస్థలు నిర్వహిస్తున్న అధికార, అనధికార సర్వేలు మునుగోడులో అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటోందనే సంకేతాలు ఇస్తున్నాయి. ఒక దశలో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకంటే చాలా ముందున్నా, ఇప్పడు తెరాస, బీజేపీల మధ్య దూరం రోజురోజుకు తగ్గిపోతోందని అంటున్నారు. ముఖ్యంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత పరిస్థితి వేగంగా మారిపోతోందని అంటున్నారు. కూసుకుంట్లకు పార్టీలోనే మద్దతు లేదని, దీంతో కింది స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల మద్దతు ఏ మేరకు ఉంటుందనే విషయంలో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
మరో వంక కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి, పాల్వాయి గోవర్ధన రెడ్డి పలుకుబడి పై ఎక్కువగా ఆధార పడుతున్నారు, అలాగే, మహిళా కార్డును ఉపయోగిస్తున్నారు. ఇంతవరకు ప్రధాన పార్టీలు ఏవీ మహిళలకు అవకాశం ఇవ్వలేదని, తొలి సారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక మహిళకు అవకాశం ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్. రెడ్డి మహిళలను గెలిపించే బాధ్యత మహిళలే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్రవంతిని గెలిపిస్తే, ములుగు ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే స్రవంతి సమ్మక్క సారలమ్మలలా అసెంబ్లీలో మహిళల గళం వినిపిస్తారని రేవంత్ రెడ్డి మహిళా కార్డ్’ను ప్రయోగించారు.అయితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారంలో పాల్గొనకపోవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్సే అవుతుందని అంటున్నారు.
ఇక బీజేపే అభ్యర్ధి రాజగోపాల రెడ్డి, కోమటి రెడ్డి సోదరుల కార్డును, వ్యక్తిగత పలుకుబడి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రధాని మోడీ, షా నాయకత్వం ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగితున్నారు. అలాగే నియోజక వర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని ప్రచారం చేస్తున్నారు. తన రాజీనామాతో నియోజక వర్గంలో పనులు జరుగుతున్నాయని ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మూడు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నా, ఇంకా ప్రచారపర్వం పతాక స్థాయికి చేరుకోలేదు. మూడు పార్టీల ముఖ్యనేతలు పూర్తి స్థాయిలో ప్రచార బరిలో దిగలేదు. దీంతో ముందు ముందు ప్రచారం జోరందుకున్న తర్వాత గానీ, వాస్తవ పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని పరిశీలకులు అంటున్నారు.
అదలా ఉంటే, మునుగోడు ఉపఎన్నికకు ఈ నెల 3న ఈసీ షెడ్యూల్ విడుదల చేయగా.. 7న నోటిఫికేషన్ వచ్చింది. 7వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 14తో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్లను అధికారుల స్వీకరిస్తారు. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. 6న కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.