ఇంతకీ ఆ డబ్బెక్కడ ?
posted on Oct 31, 2022 @ 10:53AM
జగన్ ప్రభుత్వంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఓ క్లారిటీ అయితే వచ్చేసిందా? అందుకే.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో తప్ప మరో పార్టీతో పొత్తు పెట్టుకోమంటూ .. ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ బాధ్యుడు సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పలుమార్లు చెబుతున్నారా? ఆ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై.. కేంద్రంలోని పెద్దలు..షంటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? అంటే తాజా పరిణామాలను బట్టి చూడబోతే.. అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా నిర్మలా సీతారామన్.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో పర్యటించిన సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలను వారు ఈ సందర్బంగా సోదాహరణగా వివరిస్తున్నారు.
వీరవాసరం మండలంలోని మత్స్యపూరి గ్రామాన్ని నిర్మల సీతారామన్ గతంలో దత్తత తీసుకున్నారని.. సదరు గ్రామంలో తాజాగా ఆమె రక్షిత మంచి నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారని.. ఆ క్రమంలో పరిసర ఆరు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైందా? అంటూ అక్కడే ఉన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను ఆమె ప్రశ్నించగా... అందుకు ఆయన కాలేదంటూ సమాధానం ఇవ్వడంతో.. ఈ కేంద్ర మంత్రి గారు ఒక్కసారిగా అవాక్కు అయ్యారని.. తాను 2019 ఎన్నికల ముందే ఈ ఆరు గ్రామాల్లో తాగు నీటి సమస్య పరిష్కరించడం కోసం కోటి రూపాయిలకు పైగా నిధులు విడుదల చేశానని.. నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లితే.. ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని..... కానీ అప్పుడు విడుదల చేసిన నిధుల తాలుక లెక్క ఏమైందో.. మీ సమస్యలు ఇంకా ఎందుకు అలాగే ఉన్నాయో.. ఇదిగో ఇక్కడే నిల్చున్న మీ ఎమ్మెల్యే గారు గ్రంధి శ్రీనివాస్‌నే అడగాలి.. మీలో చైతన్యం రావాలి.. ఇలాంటోళ్లని నిలదీయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తాలుక వీడియో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేసి పారేస్తోంది.
ఇది ఒక్కటే కాదు.. జగన్ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు.. ఇప్పటికీ తమ తమ నియోజకవర్గంలో పూర్తిగా పర్యటించిన దాఖలాలు అయితే లేవనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలోని కేడర్‌లో బలంగా ఉందని సమాచారం. నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో పర్యటించని ఎమ్మెల్యేలు.. ఇక ప్రజా సమస్యలు ఏమి తీరుస్తారంటూ ఓ ప్రశ్న కూడా ఆ పార్టీలోనే అంతర్గతంగా సాగుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం వైయస్ జగన్ పసిగట్టారని.. అందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారని... ఈ కార్యక్రమానికి సైతం ఎమ్మెల్యేలు డుమ్మా కోడుతుండడం విశేషమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం.. ప్రతి నెల అప్పుల కోసం పడుతోన్న తిప్పలు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బాగా తెలుసునని..అందుకే ఈ విధంగా చురకలంటించి ఉంటారనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అదీకాక.. జగన్ ప్రభుత్వం రాష్ట్రా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా.. సంక్షేమ పథకాలపైనే మాత్రమే దృష్టి సారిస్తే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది అంత సలువు కాదంటూ ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ ఓ నివేదికను సైతం.. సాక్షాత్తూ జగన్ చేతిలో పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు.. కేటాయించిన నిధులను ఉపయోగించకుండా.. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు సందేహమే అనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయినా అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే ఇట్టే తెలిసిపోతోందని... అలాగే అధికార జగన్ పార్టీలోని ఎమ్మెల్యేలు పనిమంతులా? కాదా? అంటే.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస్ పనితనం చూస్తే చాలని ఓ చర్చ అయితే తాజా తాజాగా సోషల్ మీడియా సాక్షిగా రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.