దళితులకు ఆత్మబంధువు మోడీ.. ద్రోహి కేసీఆర్: బండి విమర్శ
posted on Oct 31, 2022 @ 10:48AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దళిత ద్రోహిగా అభివర్ణించారు. అదే సమయంలో ప్రధాని మోడీని దళితుల ఆత్మబంధువుగా పేర్కొన్నారు. ప్రధాని మోడీ అంబేడ్కర్ ను ఆత్మబంధువుగా భావిస్తున్న నేత అనీ, అంబేడ్కర్ భిక్ష వల్లే బీసీని అయిన తాను ప్రధానిని అయ్యాననీ మోడీ పార్లమెంటు సాక్షిగా చెప్పడాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.
ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని విమర్శించిన బండి సంజయ్.. .నరేంద్రమోదీ ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతే.. దళితుల గౌరవాన్ని పెంచేందుకు, ఆర్దికంగా వారు వారి కాళ్లపై నిలబడేందుకు పారిశ్రామివేత్తలు, వ్యాపారవేత్తలుగా తయారు అయ్యేందుకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఇప్పటి దాకా బ్యాంకు ముఖం కూడా చూడని దాదాపు మూడు కోట్ల మంది దళితుల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి, పథకాల సొమ్మ నేరుగా వారి ఖాతాల్లో జమయ్యేలా చేసినది మోడీ మాత్రమే అన్నారు. దళితులు ఉద్యోగాలు చేసే వాళ్లుగా మిగిలిపోకేడదనీ, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని అర్హులైన దళితులకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు లోన్లు ఇచ్చే గొప్ప పథకాన్ని మోడీ తీసుకొచ్చారని బండి అన్నారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే.. మునుగోడు యువతకు కోట్లాది రూపాయలు రుణాలు ఇప్పించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని బండి అన్నారు. ఇక కేసీఆర్ అయితే దళిత అధికారులను దగ్గరకూ కూడా రానియడం లేదని బండి విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రాష్ట్రపతిని చేసేందుకు 3 సార్లు అవకాశమొచ్చింది
ఇప్పటి వరకు… తొలిసారి మైనారిటీ అయిన అబ్దుల్ కలాంగారికి, రెండోసారి రామ్ నాథ్ కోవింద్ గారికి, మూడోసారి గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన గొప్ప పార్టీ బీజేపీ అని బండి అన్నారు. కేసీఆర్ మాత్రం దళితుడిని సీఎం చేస్తానని హమీ ఇచ్చి మాట తప్పారనీ, ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చి కారణాలు చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారని విమర్శించారు.