ఏపీలో బీఆర్ఎస్ అసలు ఉందా?
posted on Jun 12, 2023 @ 10:24AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏపీలో అసలు ఉందా? ఆ పార్టీ రాష్ట్ర శాఖను ఘనంగా ఏర్పాటు చేసిన తరువాత ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అంటే ఎవరి నుంచీ సరైన సమాధానం రావడం లేదు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ ఘనంగా బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణలో కంటే ముందుగా ఏపీలోనే బీఆర్ఎస్ రాష్ట్ర శాఖను ప్రారంభించారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగులతో హడావుడి చేశారు. ఇక ఆ పార్టీలో చేరికలకు ఏపీకి హైదరాబాద్ నుంచి వాహనాలు పంపి మరీ నాయకులను రప్పించుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ లోకి స్వాగతం అంటూ హోర్డింగులు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేశారు. ఇంకే ముందు ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందనీ, కేసీఆర్ ఆ సభలలో పాల్గొంటారనీ పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టేశారు. దీంతో బీఆర్ఎస్ ఏపీలో ప్రవేశం వల్ల ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి నష్టం అన్న విశ్లేషణలూ అప్పట్లో వెల్లువెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ జనసేనాని చేసిన ప్రకటన నేపథ్యంలో బీఆర్ఎస్ పాత్ర ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు దోహదపడుతుందంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు.
ఇంతా చేసి ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారు వేళ్లతో లెక్కపెట్టగలిగేంత మంది నాయకులు మాత్రమే. వారిలో ఇప్పటికీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్నది ఎవరా అని గాలిస్తే కనిపించేది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాత్రమే. ఆయన కూడా ఏపీని వదిలేసి తెలంగాణలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఆయన వ్యాపారాలూ, భూములూ అక్కడే ఉన్నాయి మరి. ఇటీవల గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగినా ఆయన అటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం తెలంగాణలో బీఆర్ఎస్ లో ప్రముఖంగా ఉండేవారెవవరూ కూడా ఏపీవైపు చూడలేదు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి, ఏపీకి చెందిన ఇక ఏపీలో ఉన్న రావెల కిషోర్ కూడా ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టారు. తొలుత సొంత భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభిస్తామని ఘనంగా చెప్పుకున్నా చివరకు అద్దెభవనంలో తూతూ మంత్రంగా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ముగించేసి మమ అనిపించేశారు తోట చంద్రశేఖర్.
ఇక పేరుకు ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఉన్నా ఇంత కాలంగా ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా జరిగిన దాఖలాలు లేవు. సాటి తెలుగు రాష్ట్రంలోనే అడుగుపెట్టడానికి జంకుతున్న బీఆర్ఎస్ ఇక జాతీయ స్థాయిలో ఏం ఒరగబెడుతుందన్న విమర్శలు వినవస్తున్నాయి. మహారాష్ట్రలో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ప్రకటించుకున్నప్పటికీ అక్కడా ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. మొత్తంమీద బీఆర్ఎస్ పేరుకే జాతీయ పార్టీ కానీ ఉనికి మాత్రం తెలంగాణకే పరిమితమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.