వారాహిని అడ్డుకోవడానికేనా?
posted on Jun 12, 2023 @ 11:13AM
ఏపీలో జగన్ సర్కార్ విపక్షాల గొంతు నొక్కడమే పాలన అనుకుంటోందా? విపక్షాల గొంతు వినబడకుండా చేస్తేనే తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సమసిపోతుందని భావిస్తోందా? రాష్ట్రంలో ఆల్ ఈజ్ వెల్ అని జనం అనుకోవాలంటే.. విపక్షాలను అణచివేస్తే సరిపోతోందని భావిస్తోందా? అంటే ఆ పార్టీ వర్గాల నుంచి మాత్రమే ఔనన్న సమాధానం వస్తోంది.
అయితే విమర్శకులు మాత్రం విపక్ష నేతలెవరైనా జనంలోకి వెళుతున్నారంటేనే అధికార వైసీపీ వణికిపోతోందనీ, అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పోలీసులను ప్రయోగిస్తోందనీ అంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలను అడ్డుకోవడానికీ, అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అవరోధాలు, ఆటంకాలు కల్పించడానికి జీవో నంబర్ 1 ను తీసుకువచ్చి చేతులు కాల్చుకున్న వైసీపీ ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అవరోధాలు కల్పించేందుకు ఉపక్రమించింది. ఇంకా యాత్ర ప్రారంభం కాకముందే.. దానికి అడ్డంకులు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెలలో ఆయన యాత్ర జరగనుంది. ఆ యాత్రకు ముందే కోనసీమ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులోకి వచ్చేసింది. ప్రభుత్వ తీరు పరిశీలకులు, రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలోనూ, చివరాఖరికి వైసీపీ శ్రేణుల్లోనూ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ గత నాలుగేళ్లుగా వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే విపక్షాలు బయటకు రాకుండా చేయడం కోసం ఎంతకైనా తెగించేందుకు జగన్ సర్కార్ ఇసుమంతైనా వెనుకాడదని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. గతంలో కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రతిపాదన సందర్భంగా అమలాపురంలో జరిగిన అల్లర్లను నెపంగా చూపి ఏకంగా ఆరు నెలల పాటు పోలీసు యాక్ట్ ను అమలు చేశారు. ఆ పోలీస్ యాక్ట్ ను ఎత్తివేసి రెండు నెలలైందో లేదో..ఇప్పుడు మళ్లీ జనసేనాని వారాహి యాత్ర నెపంతో మళ్లీ అమలులోకి తీసుకువచ్చారు.
గతంలో పోలీసు యాక్ట్ అమలు చేయడానికి అల్లర్లు సాకుగా చూపారు. ఇప్పుడు యాక్ట్ ను మళ్లీ విధించేందుకు వారాహి యాత్ర సందర్భంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లి అల్లర్లు జరుగుతాయోమేనన్న అనుమానాన్ని నెపంగా చూపుతున్నారు. పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులపై నిషేధం ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై కేసులు పెడతారు. నెల 14 నుంచి ప్రారంభమయ్యే పవన్‌కళ్యాణ్ వారాహి యాత్ర అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ ల పరిధిని దాటి చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుతుంది. ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ తెరమీదకు తీసుకువచ్చింది. పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే పోలీస్ యాక్ట్ తీసుకువచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధాజ్ణలు ఉన్నా వారాహి యాత్ర కొనసాగుతుందని జనసేన వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో కోనసీమ జిల్లాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి.