కొనుగోలు కేంద్రాలేవీ? అన్నదాతకు అండేదీ?
posted on May 9, 2023 @ 10:39AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం రైతులకు శాపంగా పరిణమించింది.
కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. పంట దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి నప్పటికీ ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. 20 రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి కసరత్తు ప్రారంభించిన అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమైంది ఫలితంగా ఆరుగాలం శ్రమించి, అధిక వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేసిన వరి పంట మూడు రోజుల క్రితం గాలివాన బీభత్సానికి కకావికలం అయింది. ఇటీవలి అకాల వర్షాలకు పంటంతా నీట మునగగా, రైతన్నకు తీరని నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడాయి. కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టగా, ప్రసక్తే లేదని కేంద్రం పేర్కొనడంతో వరి పండించిన రైతుల్లో ఒకింత ఆందోళన మొదలయింది. గతేడాది ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ సర్కారు ప్రత్యక్ష ఆందోళనలకు దిగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెపం వెూపుకుంటూ కాలం వెళ్లదీశారు. పంట కోసే సమయం వరకు ప్రభుత్వం నుంచి సూచనలు రాకపోవడంతో అధికారులు సైతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. పంట కోతకు వచ్చే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని ఉంటే తమకు అకాల నష్టం జరిగి ఉండేది కాదని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ సంవత్సరం లక్షా 54వేల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. యాసంగి సీజన్‌లో ముందుగా సాగు చేసిన చోట దాదాపు నెల రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభం కాగా దిగుబడి అంచనాకు సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తీరా పంట కోసి ఆరబెట్టిన తరువాత అ కాల వర్షం కురిసి ధాన్యం మొత్తం తడిసిపోయింది. కొంత మొత్తం వరదలకు కొట్టుకొని పోయింది. అధికారులు సకాలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఉంటే పంటను అమ్ముకొనే వారమని రైతులు వాపోతున్నారు. ఈ యేడాది పంట ఏపుగా ఎదగడంతో దిగ బడి లాభసాటిగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా తమ ఆశలు వమ్మయ్యాయని లబోదిబో మంటున్నారు.