మోడీపై విమర్శలతో శరద్ పవార్ యూటర్న్
posted on May 9, 2023 @ 3:15PM
ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో వ్యవహరించిన తీరు పట్ల రాజకీయవర్గాలలో ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఆయన తన ప్రచారంలో మత పరమైన అంశాలను ప్రస్తావించారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఆయన మత పరమైన అంశాలను ప్రస్తావించడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. అయినా ఒక ప్రధాని ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలను ప్రస్తావించడం ఎంత మాత్రం సరికాదని శరద్ పవార్ అన్నారు.
ఎన్నికల్లో ప్రజాస్వామ్య, లౌకికవాద విలువలు కాపాడతామని ప్రమాణం చేస్తాం. కానీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం నన్ను దిగ్భ్రమానికి గురి చేసిందన్నారు. లౌకికవాదాన్ని మనమంతా అంగీకరించాం. ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో మతం గురించి, మతపరమైన అంశా గురించి మాట్లాడతామో.. అప్పుడు కొత్తరకం పరిస్థితులు ఏర్పడతాయి. అది ఏ మాత్రం మంచిది కాదని పవార్ అభిప్రాయపడ్డారు. యిక ఎన్సీపీ అధ్యక్ష పదవికి తన రాజీనామాను ఉపసంహరించుకోవడంపై కూడా ఆయన వివరణ యిచ్చారు.
ఆరోగ్యం సహకరించక రాజీనామా చేద్దామనుకున్నప్పటికీ.. తన కుమార్తె సుప్రియా సూలె అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి తన రాజీనామాను ఉపసంహరించుకున్నానని చెప్పారు. నిన్నమొన్నటి వరకూ శరద్ పవార్ బీజేపీకి దగ్గర అవుతున్నారనీ, అందులో భాగంగానే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా అనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
శరద్ పవార్ కూడా విపక్షాల ఐక్యతా యత్నాలను పక్కన పెట్టి మరీ.. అదానికి మద్దతుగా, అదే విధంగా మోడీ విద్యార్హతలపై విపక్షాల విమర్శలకు ఖండిస్తూ చేసిన వ్యాఖ్యలు.. ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారన్న ప్రచారానికి బలం చేకూర్చేదిలాగే ఉంది. అంతలోనే యిప్పుడు కర్నాటక ప్రచారంలో మోడీ తీరును విమర్శిస్తూ శరద్ పవార్ గళమెత్తారు. ఈ మరాఠా యోధుడి స్వరం మారడానికి కారణాలేమిటన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది.