మునుగోడు ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?
posted on Nov 2, 2022 9:24AM
కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు.. కాంగ్రెస్ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది. ఇది వాస్తవం. గతంలోనూ పదే పదే రుజువైన నిజం. ఇప్పుడు తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంతగా పుంజుకుని విజయాల బాట పడుతుందని అనుకుంటున్న వేళ ఆ పార్టీలోని అంతర్గత విభేదాలే ఆ పార్టీని కిందకి లాగేస్తున్నాయి.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం గోచరించింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు చేస్తున్న రాజకీయం ఎదుగుతున్న పార్టీని కిందకు లాగేసి యధాపూర్వ స్థితికి తీసుకు రావడానికి శతధా ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ లకు దీటుగా పోటీ ఇస్తుందన్న పరిస్థితి నుంచి మూడో స్థానంలో కనీసం గౌరవ ప్రదంగానైనా ఓట్లు పడతాయా అని అనుమానించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిపోయిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికపై తాజాగా వెలువడిన సర్వే సైతం కాంగ్రెస్ పుంజుకున్నదన్న సంగతిని గుర్తించలేదు. ఆ పార్టీ యథా ప్రకారం మూడో స్థానానికే పరిమితమౌతుందని తాజా సర్వే వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం ఎవరూ గుర్తించకుండా మిగిలిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కోసం ఆ పార్టీ తెలుగు రాష్ట్రాలలో తనకున్న బలమైన పునాదిని సైతం దెబ్బతీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పాగా వేసే అవకాశం ఉంటుందని ఆశించింది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ త్యాగాలను గుర్తించిన నాథుడే కనిపించని పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర ఆవిర్బావం క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ ఖాతాలో పడిపోయింది. ఇందుకు కాంగ్రెస్ స్వయంకృతమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. సరే ఎనిమిదేళ్ల తరువాత ఆధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందన్న అంచనాల మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో పార్టీ హై కమాండ్ రాష్ట్రంలో సీనియర్లను సైతం తోసి రాజని.. తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టినప్పటి నుంచీ సీనియర్ల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నా రేవంత్ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేశారన్నది నిర్వివాదాంశం. అందుకు అధిష్ఠానం ఆయనకు ఇచ్చిన మద్దతు కూడా ఒక కారణమే. అయితే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి, శాసన సభ్యత్వానికీ రాజీనామా చేసినప్పటి నుంచీ సీన్ మారిపోయింది.
రాజగోపాల్ రెడ్డి రాజీనామాను సాకుగా తీసుకుని రేవంత్ కి వ్యతిరేకంగా కోవర్టులు, సీనియర్ల చర్యలతో ఆ పార్టీ మళ్లీ తిరుగమనం వైపు తన పయనం మొదలు పెట్టింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేని పరిస్థితులు ఆయనకు ఎదురయ్యాయి. .ఇప్పడు పరిస్థితి ఎలా తయారైందంటే మునుగోడులో గెలుపు సంగతి దేవుడెరుగు.. ఉప ఎన్నిక తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రంగానైనా ఉంటుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ వ్యతిరేకులు మునుగోడులో పార్టీ ఓటమినే కోరుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇందకు ఉదాహరణగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను వారు ప్రస్తావిస్తున్నారు. మునుగోడులో పార్టీ పరాజయం ఖాయం. అదే జరిగితే రేవంత్ స్థానంలో టీపీసీసీ చీఫ్ గా తాను వస్తాననని ఆయన తన సన్నిహితులతో మాట్లాడిన మాటల తాలూకా ఆడియో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఇంత డెలిబరేట్ గా వెంకటరెడ్డి పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నా.. ఆయనపై ఇప్పటి దాకా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోకపోవడాన్ని వారు హైకమాండ్ నిస్సహాయతకు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు.
కోమటిరెడ్డి సోదరులపై అధిష్ఠానానికి విశ్వాసం లేకపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ బాధ్యతల నుంచి తప్పకుంటానని చెప్పినప్పుడు వారిలో ఒకరికి కాకుండా రేవంత్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించడమే నిదర్శనం. అలా అప్పగించిన తరువాత అధిష్ఠానం కోమటిరెడ్డి సోదరులు అసంతృప్తిని, అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేసిన వెంటనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదని పరిశీలకులు అంటున్నారు. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న చందంగా కాంగ్రెస్ హై కమాండ్ వ్యవహరించడంతో రేవంత్ సాధించిన పట్టు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
ఇక ఇప్పడు మునుగోడు ఉప ఎన్నిక వద్దకు వస్తే.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ప్రచారం తక్కువ,అంతర్గత విభేదాలు ఎక్కువ అన్న చందంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మునుగోడు ఫలితం తరువాత పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.