జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ఈడీ నోటీసులు
posted on Nov 2, 2022 @ 10:35AM
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో గురువారం (నవంబర్ 3) విచారణకు హాజరు కావాలని ఈడీ ఆ నోటీసులో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి హేమంత్ సొరేన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కింద పంకజ్ మిత్రాపై కేసు నమోదు చేసిన ఈడీ.. ఈ కేసుకు సంబంధించి రష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో విస్తృత దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పంకజ్ మిశ్రా నివాసాలతో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించింది.
అలాగే దాదాపు 13.32 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసింది.అంతే కాకుండా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ నివాసాలలో కూడా ఈడీ గతంలో తనిఖీలు నిర్వహించిన సంగతి విదితమే. అలాగే ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానే గనుల కేటాయింపు చేసుకున్నారని పేర్కొంటూ.. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ జార్ఖండ్ గవర్నర్ కు ఈసీ గతంలో సిఫారసు కూడా చేసిన విషయం తెలిసిందే.
జార్ఖండ్ లో ఓటమి, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కేసీఆర్ కు సన్నిహతంగా మెలగడం బీజేపీ కన్నెర్రకుకారణమైందనీ, అందుకే ఆయనకు ఇబ్బందులు సృష్టించే దిశగా వేసిన అడుగే ఈసీ నోటీసు అని రాజకీయ నిపుణులు అప్పట్లో అభిప్రాయపడిన సంగతి విదితమే. ఇప్పుడు అదే అక్రమ మైనింగ్ కేసులో ఈడీ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది.