మునుగోడులో టీఆర్ఎస్ వ్యూహం అదేనా?
posted on Aug 10, 2022 @ 10:51AM
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు అవసరం లేని తలనొప్పి వచ్చి పడింది. అదే మునుగోడు ఉప ఎన్నిక. అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాదు. అక్కడ ఏ పార్టీ గెలిచినా టీఆర్ఎస్ కు ఒరిగేది కానీ, పోయేది కానీ ఏముండదు. అయినా అనివార్యంగా ఆ ఉప ఎన్నికను ప్రతిష్ఘాత్మకంగా తీసుకోవలసిన అవసరం తన్ను కొచ్చింది.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరగనున్న ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తేనే రాష్ట్రంలో తమ సత్తా ఏ మాత్రం తగ్గలేదని చాటుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఫలితం వస్తే.. ఇంత కాలంగా టీఆర్ఎస్ పనై పోయింది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఊతం లభిస్తుంది. ఆ ప్రచారమే వాస్తవమా అన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో ప్రబలే ప్రమాదమూ ఉంది. పరిశీలకులు చేస్తున్న విశ్లేషణలు ఇలా ఉంటే.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచన మాత్రం వేరేలా ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక జస్ట్ ఉప ఎన్నిక అంతే అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ.. టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా కేటీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఆస్క కేటీఆర్ అన్న కార్యక్రమంలో నెటిజన్లతో భేటీ సందర్భంగా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వల్ల వచ్చిదీ, పోయేదీ ఏం ఉండదు అని వ్యాఖ్యానించారు. మునుగోడులో విజయం కోసం టీఆర్ఎస్ ఏ మంత సీరియస్ గా ప్రయత్నించడం లేదని చాటేందుకే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అలా మాట్లాడారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అసలీ ఉప ఎన్నికపై కంటే కేసీఆర్ దృష్టి అంతా ఆ తరువాత రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని వారంటున్నారు.
ఆ ఎన్నికల్లో విజయం కోసమే ఆయన ఇప్పటి నుంచీ వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేననీ, దానికి తమ అధినేత కేసీఆర్ కూడా గుర్తించారనీ అంటున్నారు. అయితే ఆయన అంచనా ప్రకారం టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఒకే పార్టీకి పడితేనే టీఆర్ఎస్ కు కష్టమనీ, అలా కాకుండా టీఆర్ఎస్ ప్రత్యర్థుల మధ్య వ్యతిరేక ఓటు చీలిపోతే పార్టీ విజయం సునాయాసమని ఆయన భావిస్తున్నారు.
పార్టీ ప్రత్యర్థుల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే మునుగోడు ఉన ఎన్నికను పెద్దగా సీరియస్ గా తీసుకోనవసరం లేదంటున్నారు. అన్నిటికీ మించి జాతీయ స్థాయిలో బీజేపీ పరువు తీయడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. హస్తిన స్థాయిలో చక్రం తిప్పి మరీ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా మునుగోడు ఉప ఎన్నికకు మార్గం సుగమం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేసీఆర్ తన మంత్రివర్గ సహచరుల వద్ద, పార్టీ ముఖ్యుల వద్దా చెప్పినట్లు టీఆర్ఎస్ శ్రేణుుల చెబుతున్నాయి.
జాతీయ స్థాయిలో బీజేపీకి దిమ్మ తిరిగేలా మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ పరాజయం పాలయ్యేలా ఎత్తులు వేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కాంగ్రెస్ కు మద్దతు నిచ్చి ఆ పార్టీని గెలిపిస్తే బీజేపీకి గాలి తీసేసినట్లౌతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. పరిశీలకులు కూడా పోటీ పడి ఓడిపోయి హుజూరాబాద్ లో భంగపడిన దాని కంటే.. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఊతం ఇచ్చి.. బీజేపీని ఓడించడం వల్లే రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం టీఆర్ఎస్ కు ఉంటుందని అంటున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికను కలిసి వచ్చిన అవకాశంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మునుగోడు కచ్చితంగా కాంగ్రెస్ కు కంచుకోట. అక్కడ బీజేపీకి గానీ, టీఆర్ఎస్ కు గానీ పెద్దగా పట్టు లేదు. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ అక్కడ ఉప ఎన్నికలో లబ్ధి పొందేలా పథక రచన చేసి అమలు చేస్తోంది. ఇక్కడే కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉందంటున్నారు.
బీజేపీకి రాష్ట్రంలో ప్రచారం చేసుకుంటున్నంతగా బలం కానీ, ప్రజాభిమానం కానీ లేదని చాటేందుకు మునుగోడు ఉప ఎన్నికను సాధనంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెరాస శ్రేణులు చెబుతున్నాయి. అందుకే మునుగోడులో కాంగ్రెస్ కు ఇప్పటికే గట్టి ఓటు బ్యాంకు ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా కారణంగా అక్కడ తగ్గిన ఓటును తన మద్దతు ద్వారా కాంగ్రెస్ కు అందేలా చేస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. టీఆర్ఎస్ కు అది ఎటూ సిట్టింగ్ సీటు కాకపోవడం వల్ల కాంగ్రెస్ విజయం సాధిస్తే.. బీజేపీది బలం కాదు వాపు మాత్రమే అని చాటేందుకు పనికి వస్తుంది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎటూ కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటు చీలి తమ విజయం ఖాయమౌతుందన్నది టీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. మునుగోడు విజయంతో కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుంది. అప్పుడు కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక భారీగా ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. మునుగోడు ఉప పోరును పూర్తిగా బీజేపీ- కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ పోరుగా మారితేనే టీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందన్న భావనలో కేసీఆర్ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం లేదనీ, అదొక ఉప ఎన్నిక అంతేనని కేసీఆర్ వ్యాఖ్యానించారంటున్నారు.