లొంగిపోయిన మావోయిస్టుల దారెటు?
posted on Oct 29, 2025 @ 10:08AM
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడికి వెడతారు. ఇదొక ఫండమెంటల్ క్వశ్చన్. కారణమేంటంటే.. ఒకరిద్దరు తప్ప.. కుప్పలు తెప్పలుగా లొంగిపోతున్న వారంతా కూడా దాదాపు అడవి బిడ్డలే. దశాబ్దాలుగా ఉద్యమంలోకి చదువుకున్న వారెవరూ వెళ్లడం లేదు. నగర వాసులెవరూ రావడం లేదు. మావోయిజం అంటే ఏమిటి? దాని పరిణామ క్రమాలేమిటి? ప్రస్తుత సమాజానికి దాని ద్వారా వచ్చే లాభమేంటి, నష్టమేంటన్నది ఇక్కడెవరూ పెద్దగా పట్టించు కోవడం లేదు. ఆ మాట కొస్తే చైనా ప్రోడక్ట్స్ ఏవీ కూడా వాడకూడదన్న కొన్ని నియమాలను పెట్టుకున్న ఒకానొక నాగరిక జాతి తయారైన పరిస్థితులు. కొందరైతే తొలుత చైనా బజార్ లు గా పెట్టుకుని ఆ తర్వాత మనకూ చైనాతో వచ్చిన సరిహద్దు గొడవల కారణంగా.. భారత్ బజార్లుగా వాటిని మార్చుకున్న పరిస్థితులు.
చైనాలోనే మావోయిజాన్ని అమలు చేసే వారెవరూ లేరు. చైనాది మొత్తం దురాక్రమణ- దురాలోచన- దుర్నీతి. అలాంటి చైనాయే వాడ్డం మానేసిన మావోయిజాన్ని ఇక్కడ అమలు చేయడానికి గానీ, ఫాలో కావడానికి గానీ ఎవరూ పెద్దగా సిద్ధంగా లేరు. ఈ విషయం స్వయంగా కొందరు మావోయిస్టు మద్ధతుదారులు కూడా అంగీకరిస్తున్నారు.
ఇప్పుడు ఉద్యమంలోకి చదువుకున్న వారెవరూ రావడం లేదు. ఉన్న ఆ ఫాలోయర్లు, లేదా దళంలో ఉన్న వారంతా కూడా అడవి బిడ్డలే. వీరికి మావోయిజం మీదున్న అవగాహన, శ్రద్ధాసక్తులకన్నా.. తమ తమ ప్రాంతాల్లో లేని వసతుల మీదే ఎక్కువ ఫోకస్. అడవుల్లో లేని వసతులతో పాటు జరిగే వనరుల దోపిడీ కారణంగానే వీరు ఎక్కువగా మావోయిస్టులుగా మారి ఉద్యమంలోకి వస్తుంటారు. తొలి తరం తప్ప ఆ తర్వాతి తరాల్లోని వారంతా దాదాపు అడవి బిడ్డలే ఎక్కువ. ఒక వేళ మావోయిజానికి ఫ్యూచరంటూ ఒకటి ఉంటే.. టాప్ లీడర్షిప్ నుంచి లోయర్ కేడర్ వరకూ అందరూ వారే ఉండే అవకాశమెక్కువ అని చెబుతారు జగన్ వంటి మావోయిస్టు నేతలు. ఆ మాటకొస్తే నేడో రేపో హిడ్మా సైతం లొంగిపోయే అవకాశాలున్నాయంటున్నారు.
అలాంటి వారు ఇప్పుడు తమ దగ్గరున్న ఆయుధాలను అప్పగించారు సరే. వారికంటూ ఒక పునరావాసం ఎక్కడైనా పోలీసులు ఏర్పాటు చేసి ఉండొచ్చుగాక.. మల్లోజుల వంటి వారికి ఊళ్లల్లో కుటుంబం, బంధువులు ఉండటం వలన.. వారంతా ఆయా ఇళ్లకు వెళ్లిపోయే అవకాశముంది. మరి ఈ అడవి బిడ్డలు ఎక్కడికి వెళ్లాలి? అంటే తిరిగి అదే అడవుల్లోకే వెళ్లాల్సి ఉంటుంది. అడవులన్నాక తిరిగి ఆయుధం పట్టి తీరాల్సిందే . ఎందుకంటే అక్కడ మనుగడ సాగించాలంటే తుపాకీ, లేకుంటే ఏ విల్లంబుల్లాంటి ఆయుధాలనైతే వారు చేబట్టాల్సిందే. మరి వారు సాయుధ పోరాటాన్ని ఆపి.. పోలీసులకు లొంగిపోయారన్న వార్తల్లో నిజమెంత? అన్నదిప్పుడు స్పెషల్ డిబేట్ గా మారింది.