ఎన్ఐఏ విస్తరణ ఆంతర్యమేంటి?.. కోడికత్తి కేసు గతేంటి?
posted on Oct 28, 2022 @ 10:16AM
తిట్టించడానికి, కొట్టడానికి మనుషులుండాలి.. అప్పుడే రాజుగారికి ఆనందం, చేతులకు మట్టి అంటకుండా చితక్కొ ట్టించేయచ్చు, మరీ ఆసక్తి కలిగితే ఊచలూ లెక్కపెట్టించొచ్చు. ఖర్చులేకుండా అనుకున్న పనులు చేయించేయవచ్చు. అలాంటి మహత్తర ఆలోచన ఈ ఆధునిక కాలంలో బీజేపీ వారికే వచ్చింది. ఎవరు పడితే వారు తమ మీదా, పార్టీ మీద విరుచుకుపడకుండా, తిట్టుకోకుండా చెప్పిన మాట వింటూ పడి ఉండేలా చేసుకోవడానికి ఎన్ ఐ ఏ సంస్థను జేబు సంస్థగా మార్చుకుని అన్ని రాష్ట్రాల్లోనూ తోలుబొమ్మలాట ఆడించాలని మహత్తర మార్గం ఆలోచించిన ఘనులు బీజేపీ సీనియర్లు.. హోం మంత్రి అమిత్ షా తదితరులు.
గతకొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది. దేశంలో ఏ ఘటన జరిగినా..మూలాలు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ తన వేటను కొనసాగిస్తోంది. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, భైంసాలో సోదాలు చేపట్టారు. ఇటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీ ఎఫ్ ఐ) కార్యకలాపాలపై నిఘా ఉంచింది. నిజామాబాద్‌లో మొత్తం 20 చోట్ల నాలుగు ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇటు నిర్మల్ జిల్లా భైంసాలోనూ సోదాచేపట్టారు. స్థానిక మదీనా కాలనీలో పలు ఇళ్లల్లో దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జగిత్యాలలో మూడు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. టవర్ సర్కిల్‌లోని కేర్ మెడికల్, టీఆర్ నగర్‌లో ఓ ఇంటిలో ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈసందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏపీలోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని ఖాజానగర్‌లో విస్తృతంగా సోదాలు చేశారు.
ఉగ్రవాద సంస్థ ఐసిస్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తెలిపింది. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఐసిస్ కార్యకలాపాలు కొనసాగుతు న్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా రాజ్యసభలో ఇదే విషయాన్ని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసిస్ సానుభూతిపరులపై ఇటీవల 17 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 122 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ తమ సిద్ధాంతాలను ప్రచారంయువతకు గాలం వేస్తోందని తెలిపారు. ఉగ్ర సంస్థల కార్యకలపాలపై నిఘా కొనసాగుతోందని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవన్నీ అంగీకరించాల్సినదే. కానీ వాటిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాల్లో మరింత నిఘా పెంచాల్సిన అవసరముందన్న మాట చెబుతూ ప్రజలకు నిద్రలేకుండా చేయడం ఎంతవరకూ సబబు? కేంద్రం, ఎన్ ఐఏ లక్ష్యాలు ఎలా ఉన్నా, సంఘ విద్రోహులను ఏరివేసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా చేపట్టాల్సి వస్తుందని, తనిఖీలు, సోదాల గురించి ఎంత వివరణ ఇచ్చుకున్నప్పటికీ చిన్న చిన్న కేసుల్లో విచారణ పట్టనట్టు వదిలేస్తే నిందితులుగా పట్టుబడినవారు జైళ్లల్లోనే మగ్గిపోవాల్సిందేనా అనే అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
తమ పరిధి అంతకు మించిందని చిన్నపాటి కేసులను వదిలేస్తే రాష్ట్రప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లకపోవడంతో బాధితుల కుటుంబాలు కూడా వేదనకు గురవుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ ఒక విభాగం పెట్టడం వల్లనే ప్రత్యేకించి ఒరిగేదేమిటన్నది ప్రశ్న. కేవలం ఉగ్రవాదులతో, సంస్థలతో సంబంధం వున్నవారిని గుర్తించి ఏరివేసేందుకు భయోత్పాతాలు కల్పించడానికి, సామాన్యులను సోదాల పేరుతో ఖంగారు పెట్టడమే జరుగుతుంది.
బీజేపీ ఇప్పుడు అందుకే శ్రీకారం చుట్టింది. దేశంలో ఉగ్ర కార్యకలాపాల నిరోధం సాకుతో 2024 తరువాత దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఐఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించంది. హర్యానా సూరజ్ కుండ్ లో జరుగుతున్న చింతన్ బైఠక్ లో కేంద్ర హోంమంత్రి షా గారు ఎన్ఐఏకు ప్రతి రాష్ట్రంలోనూ ఒక కార్యాలయం ఉంటుందన్నారు. నార్కోటిక్స్, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కానీ అన్ని రాష్ట్రాల్లోనూ తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రాంతీయ వ్యతి రేకతకు, నినాదానికీ అవకాశం లేకుండా చేయడానికే ఆ నిర్ణయం తీసుకున్నట్టు తోస్తుంది.
2008లో ముంబైలో ఉగ్రవాదుల దాడుల తర్వాత ఎన్ఐ ఏ ఏర్పాటయి అదే ఏడాది డిసెంబర్ లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. ఉగ్ర కార్యకలాపాల నిరోధం విషయంలోనూ.. ఉగ్ర కేసుల దర్యాప్తులోనూ ఎన్ఐఏ ప్రతిభ, చొరవలను అందరూ ప్రస్తుతిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే ఎన్ఐఏను అడ్డు పెట్టుకుని తమ వ్యతిరేకులను వేధించాలన్న ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. ఉదాహరణకు కోడికత్తి శ్రీను కేసే తీసుకుంటే.. అది ఏ విధంగా చూసినా ఎన్ఐఏ పరిధిలోకి రాదు.. కానీ 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది.
అంతే ఇక ఆ కేసు దర్యాప్తును పక్కన పెట్టేసింది. ఎందు కంటే ఈ కేసు దర్యాప్తునకు సమయం వెచ్చించేంత తీరిక ఎన్ఐఏకు ఉండదు కనుక. దేశ ద్రోహం, ఉగ్ర కార్యకలాపాలు ఎన్ఐఏ పరిధి. కోడికత్తి కేసు ఆ పరిధిలోకి రాదు కనుక.. ఈ కేసును ఎన్ఐఏ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ జరుగుతున్నదేమిటి. ఎన్ఐఏ కేసు కనుక ఈ కేసులో కోడి కత్తి శీనుకు బెయిలు రాదు. జైళ్లో మగ్గాల్సిందే. గత నాలుగేళ్లుగా కోడి కత్తి శీని జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటైతే.. దేశమంతటా కోడికత్తి శీనుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పెట్టి కేసులను కూడా ఎన్ఐఏకి అప్పగించేసి అమాయకులను జైళ్లకు పంపే కార్యక్రమం మొదలౌతుంది. అధికారంలో ఉన్న వారు తమ ప్రత్యర్థులను వేధించడానికి ఎన్ఐఏను ఒక అయుధంగా వాడుకునే ప్రమాదం పెరుగుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇప్పటికే కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని వేధిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటుతో ముందు ముందు రాజకీయ వేధింపులకు ఎన్ఐఏ కూడా కేంద్రం చేతికి ఒక ఆయుధమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.