దేశంలో ఏదో జరుగుతోంది ఏమిటది ?
posted on Sep 22, 2022 @ 8:50PM
దేశంలో ఏదో జరుగుతోంది. ఏమి జరుగుతోంది అనే విషయంలో ఎవరికీ అంత స్పష్టత లేక పోయినా, ఏదో జరుగుతోందనే అనుమానాలు మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఓ వంక రాష్ట్రీయ స్వయం సీవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లిం సమాజంతో సయోధ్య యత్నాలకు శ్రీకారం చుట్టింది. సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఇతర సంఘ్ పెద్దలతో కలిసి, ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ అధిపతి ఇమాం ఉమేర్ అహ్మద్ ఇల్యాసి తో సమావేసమయ్యారు. ఢిల్లీ లోని కస్తూరిబా గాంధీ మార్గ్ చర్చిలో బుధవారం(సెప్టెంబర్21) సుమారు గంటకు పైగా ఈ రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోహన్ భగవత్ తో పాటు సంఘ్ ప్రముఖులు కృష గోపాల్, రామ్ లాల్, ఇంద్రేష్ కుమార్ కుడా పాల్గొన్నారు.
అయితే, ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన్యత ఏదీ లేదని, ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ చెప్పారు. దేశంలో మత సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ముస్లిం మేథావులతో చర్చలు జరుపుతున్నారని, అందులో భాగంగానే ఈ సమావేశం జరిగిందని అంతకు మించి ఈ భేటికీ ప్రత్యేక ప్రధాన్యత లేదని అయన చెప్పారు. సంఘ్ అధినేత అన్ని వర్గాల ప్రజలతో నిరంతరం నిర్వహించే, ‘సంవాద్’ కార్యక్రమంలో భాగంగానే మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ అధిపతి ఇమాం ఉమేర్ అహ్మద్ ఇల్యాసి కలిశారని చెప్పారు.
కానీ అదే సమయంలో దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్నాయి. మరోవంక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోం శాఖ సీనియర్ అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. అలాగే, హోంమంత్రి నిర్వహించిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధొభాల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా సహా పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. పీఎఫ్‌ఐ కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఈ భేటీలో చర్చించినట్లు ఓ అధికారి వెల్లడించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఏదో తీసుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
నిజానికి పీఎఫ్‌ఐ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలలో మత ఉద్రిక్తలకు దారి తీసిన సంఘటనల వెనక, పీఎఫ్‌ఐ హస్తం ఉందని ఎన్‌ఐఏ నిర్ధారణకు వచ్చింది. అలాగే మొదటి నుంచి కూడా యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ చట్ట విరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది. ఈ దాడుల అనంతరం కేంద్రం పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమిత్ షా అత్యవసర భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ఆర్ఎస్ఎస్ అధినేత్ మోహన్ భగవత్ ముస్లిం పెద్దలు, మేథావులతో సమావేసమై ఉంటారని అంటున్నారు. అలాగే ఇటీవల మహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను, అదే విధంగా హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపే అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జరుగతున్న పరిణామాలు, గతంలో జరిగిన పరిణామాలు ఒకదానికొకటి సంబంధం లేనట్లు కనిపించినా ఎక్కడో ఏదో సంబంధం ఉన్నట్లే ఉందని, అందుకే దేశంలో ఏదో జరుగుతోందని అనుమానించ వలసి వస్తోందని అంటున్నారు.