గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? ఎందుకు వస్తుంది??
posted on Feb 28, 2023 @ 9:30AM
ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. అయితే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకొస్తుంది?? అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? తెలుసుకుంటే..
మనం ఆహారంతో పాటు గాలిని మింగుతుంటాం. ఈ అలవాటున్నా కార్బొనేటెడ్ పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటున్నా, చూయింగ్ గమ్ తినే అలవాటున్నా, ధూమపానం చేస్తున్నా త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వారిలో కడుపులోపల బాగా ఉబ్బరించినట్లుంటుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆ వాయువు కారణం చేతనే గుండె మండుతున్నట్లుంటుంది. జఠరాశయంలోని ఈ గాలి చిన్న ప్రేగులలోకి వెళ్తుంది. ఇక్కడ ఇది చిన్నప్రేగుల గోడలద్వారా పీల్చిబడుతుంది. లేకపోతే గ్యాస్ రూపంలో బయటికి నెట్టివేయబడుతుంది.
కడుపుబ్బరించే గాస్ తో బాధపడుతున్నా మనిపించినప్పుడు ఏ పదార్థాలు గ్యాస్ ని ఉత్పత్తి చేయడానికి కారణం అవుతున్నాయో వాటిని తినడం మానేయాలి. అలాగే గ్యాస్ ఉత్పత్తికి కారణమైన అలవాట్లని మానుకోవాలి. చాలా మంది త్రేన్పులు వస్తుంటే లోపలి గాలి బయటకు వెళ్ళి పోతోందని అనుకుంటారు. కాని వాస్తవానికి ఈ త్రేన్పుల వల్ల లోపలి పరిస్థితి మరింతగా దెబ్బతింటుంది. ఒక్కోసారి జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేప్పుడు కూడా రకరకాల రసాయనిక మార్పులు కారణంగా కూడా గ్యాస్ ఉత్పత్తి కావచ్చు. జఠరాశయం, పెద్ద, చిన్న ప్రేగులు గాలితో నిండి ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. త్రేన్పుల ద్వారా వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వుంటాయి. అదే గ్యాస్ రూపంలో వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ లతోపాటు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిధేన్ కూడా వుంటాయి. పిండి పదార్థాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు ఆ పదార్థాలు చిన్నపేగులలో పేరుకు పోయినప్పుడు బాక్టీరియా అనే సూక్ష్మజీవులు అక్కడ చేరతాయి. ఈ బాక్టీరియా వున్నప్పుడు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిథెన్ గ్యాస్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ కుళ్ళిన పదార్థాల దగ్గరే చెడ్డ వాసన పుడుతుందన్నమాట!
ఇలా గ్యాస్ సమస్యతో ఇబ్బందికి గురువుతున్నప్పుడు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిని ఒక్కసారిగా తాగేయకూడదు. కొద్దికొద్దిగా చప్పరిస్తూ త్రాగాలి. ఆహారాన్ని పెదాలు మూసుకుని బాగా నమిలి తినాలి. మనస్సు ఆందోళనగా వున్నప్పుడు కాక ప్రశాంతంగా వున్నప్పుడు తినాలి. కొద్ది కొద్దిగా తినాలి. ఎక్కువెక్కువ తినకూడదు.
గుండె ప్రాంతంలో మంట ఈ గ్యాస్ ఉత్పత్తి కారణానో, యాసిడ్ ఉత్పత్తి కారణానో వస్తుంటుంది. ఈ మంట లోపలి మార్పులను సూచించే ఒకానొక సిస్టమే కానీ జబ్బుకాదు. ఈ మంట లోపల ఆహారం పులియడం వల్లగాని, నోటిలో కొంత జీర్ణమైన ఆహార పదార్థాలు ఉండడంవల్ల కూడా కలగవచ్చు. ఆహారం జీర్ణమవడానికి జఠరాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ ఎంజైమ్స్ కలుస్తాయి. ఈ కారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వొస్తుంది.
◆నిశ్శబ్ద.