సర్వేల వెనుక చీకటి కోణాలు! ఆరా సర్వే అసలు కథేంటి?
posted on Jul 15, 2022 @ 2:10PM
తెలంగాణలో ఇప్పుడు సర్వేల సీజన్ నడుస్తోందా? ఎన్నికల వ్యూహ కర్తల హవా నడుస్తోందా? రాష్ట్రంలో సర్వే జనులు, ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్ పెరుగుతోందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అయితే, అదే సమయంలో, ప్రతి సర్వే వెనక ఒక చీకటి కోణం దాగుందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
గత మూడు నాలుగు రోజులగా ఆరా మస్తాన్ సర్వే చుట్టూ సాగుతున్న చర్చ రచ్చ వివాదం వెనక కూడా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల చీకటి కోణం దాగుందని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నట్లు తెసుస్తోంది. కొద్దిరోజుల క్రితం టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ హైర్ చేసుకున్నఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ మొదలు బీజేపీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న, ఆరా మస్తాన్ వరకు అందరు చేసిన సర్వేలలో కాంగ్రెస్ నెంబర్ వన్ ప్లేస్’లో ఉందని, చెప్పు కొచ్చారు. అయితే, సర్వేల ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ అందరి సర్వే నివేదికలు, తనకు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు ఇచ్చారో మాత్రం చెప్పలేదు.
అయితే,రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి వంటి నాయకులు తమ అభద్రతా భావాన్ని, భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు సర్వేలను అడ్డుపెట్టుకుని గంభీర ప్రకటనలు చేయడం కొత్త విషయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పుడప్పుదు ఇలాంటి విన్యాసాలు చేస్తూనే ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏదో గాలి కబురుగా కాకుండా, సర్వే సంస్థలు, సర్వే సంస్థల యజమానుల పేర్లు కూడా తీసుకున్నారు. ఆ నివేదికలు అన్నీ, తన కళ్ళతో తాను చూసినట్లే చెప్పుకొచ్చారు. ఒక విధంగా, విత్ అల్ డ్యూ రేస్పెక్ట్స్ టూ కేఏ పాల్ , అయన స్టైల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసిందని, తాను ముఖ్యమంత్రి అయిపోయాననే భ్రమలు సృష్టించే ప్రయత్నం చేశారు. బహుశా, ఆ సంస్థలేవీ తమను పట్టించుకోవని అనుకున్నారో ఏమో కానీ, సర్వే సంస్థల పేర్లు చెప్పి మరీ జబ్బలు చరుచు కున్నారు. అయితే, కాంగ్రెస్ ‘బలుపు’కు రేవంత్ ఆధారంగా చూపిన ఆరా మస్తాన్’ రేవంత్ రెడ్డి తమ సంస్థ పేరు తీసుకునందున, వివరణ ఇచ్చేదుకు స్వయంగా తెరమీదకు వచ్చారు.
ఆయన, తమ సంస్థ జరిపిన సర్వేకి సంబంధించి రేవంత్ చెప్పింది తప్పని చెప్పారు. ఆయన వెర్షన్ అయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో కాదు థర్డ్ పొజిషన్ లో ఉందని తమ సర్వే నివేదికను బయట పెట్టారు. అక్కడితో అగ్గి రాసుకుంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చేయని చౌకీదార్ చోర్ వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం చేసి, చివరకు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు, ఆరా మస్తాన్ కోర్టుకు వెళితే రేవంత్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పవలసి వస్తుందని అనుకున్నారో ఏమో కానీ, రేవంత్ రెడ్డి అనుచరులు ఎదురు దాడి ప్రారంభించారు. అప్పుడు గానీ, రేవంత్ రెడ్డి ఎక్కడ తప్పులో కాలేశారో ఆయనకు, కాంగ్రెస్ పార్టీలో ని ఆయన వర్గానికి తెలిసినట్లు లేదు. అయితే, రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం వెంటనే సన్నాయి నొక్కులు ప్రారంభించింది.
రేవంత్ రెడ్డి తమ ఇమేజ్ ని పెంచుకునేందుకు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీశారని లోపాయికారిగా దెప్పిపొడవడం ప్రారంభించారు. అసత్యాలు, అర్థ సత్యాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి వర్తమానం చేర వేశారు. అదే సమయంలో, రేవంత్ వర్గం డ్యామేజి కంట్రోల్ చర్యల్లో భాగంగా, ఆరా మస్తాన్ పుట్టు పూర్వోత్తరాలు, బయటకు తీసి ఆయనకు బీజేపీతో ఉన్న సంబంధాలను బయట పెట్టారు. ఆయన భావజలాం లోతులు తవ్వి ఆయన సంఘీయుడు అని తేల్చారు. కావచ్చును, అయనకు బీజేపీతో సంబంధాలు ఉన్న మాట నిజం కావచ్చును. ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో సంబంధాలు ఉంటే ఉండ వచ్చును, ఆమాటకొస్తే, రేవంత్ రెడ్డి రాజకీయ మూలాలను తవ్వి తీసినా ఆయన కూడా సంఘీయుడే.
ఏబీవీపీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలైందని అంటారు. అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు, ఎందుకోసమో, ఎందు కోసమో ఏముంది లెండి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సొంతగా జరిపించిన సీక్రెట్ సర్వే లో కాంగ్రెస్ పరిస్థ్తితి ఏమంత బాగలేదని తేలిందని, ఢిల్లీకి సమాచారం చేరినట్లు తెలుస్తోంది. అలాగే, రేవంత్ రెడ్డి పీసీసి చీఫ్ గా కొనసాగితే, పెద్ద సంఖ్యలో రెబెల్ అభ్యర్ధులు బరిలో దిగే ప్రమాదముందని, ఆయన తమ వర్గం వారికే టికెట్లు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని, అదే జరిగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని సీనియర్లు నేరుగా అధిష్టానానికి నివేదికలు సంర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి సర్వే నివేదికలను అడ్డు పెట్టునికి తనను తానూ రక్షించుకునే ప్రయత్నం చేశారని, విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, అది ఎవరి వ్యుహమో, ఎవరితో ఎవరి చీకటి ఒప్పందమో ఏమో కానీ, ఆరా మస్తాన్ తెర మీదకు రావడంతో రేవంత్ కథ అడ్డం తిరిగిందని, అంటున్నారు.