రాత్రి 7-8 లోపు భోజనం చేసి చూడండి.. ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయి..!
posted on Aug 8, 2025 @ 12:50PM
మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు. ఏది తిన్నా అది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు.
నేటి బిజీ లైఫ్ లో రోజంతా హడావిడిగా పనులు చేయడమే కాదు.. హడావిడిగా తినడం కూడా జరుగుతోంది. రాత్రి సమయంలో కొన్నిసార్లు 9 గంటలకు, కొన్నిసార్లు 10 లేదా 11 గంటలకు తింటుంటారు. తిన్న వెంటనే నిద్రపోతారు. కానీ రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు. దీని గురించి తెలుసుకుంటే..
7-8 మధ్య భోజనం ఎందుకంటే..
7-8 గంటల మధ్య భోజనం చేయడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా భోజనం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా నిద్ర, గుండె, జీర్ణక్రియ, చక్కెర నియంత్రణకు కూడా చాలా మంచిది. త్వరగా భోజనం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందని, అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం, నిద్ర నాణ్యతకు కూడా ఇది 7-8 మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల షుగర్ సమస్య వచ్చే ప్రమాదం సాధారణం కంటే 20 శాతం ఎక్కువ ఉంటుందట.
జీర్ణశక్తి..
త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. రాత్రి 8 గంటల ముందు భోజనం చేసినప్పుడు, శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి దాదాపు 2 నుండి 4 గంటలు పడుతుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది, గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడతాయి.
త్వరగా భోజనం చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) ప్రమాదం 50% తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ మందగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది, కాబట్టి రాత్రిపూట తేలికగా, త్వరగా తినాలి.
నిద్ర..
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లభించదు. దీని ప్రభావం నిద్రపై కూడా కనిపిస్తుంది. నిద్రపోవడానికి 2-3 గంటల ముందు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర గాఢంగా పడుతుంది. 7-8 మధ్య రాత్రి భోజనం చేసేవారికి నిద్రలో గ్యాస్, గుండెల్లో మంట లేదా భారం తక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది.
బరువు..
బరువు తగ్గాలనుకునేవారు ఆహారం మాత్రమే కాదు, తినే సమయం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ (2013) ప్రకారం, సాయంత్రం 7 గంటలకు ముందు తినేవారిలో శరీరం కేలరీలను శక్తిగా మార్చగలదు కాబట్టి బరువు తగ్గడం వేగంగా ఉంటుంది.
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. త్వరగా తినడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది. ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత శారీరక శ్రమ లేదా కాస్త వాకింగ్ చేయడానికి కూడా సమయం దొరుకుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
డయాబెటిక్ రోగులు సమయానికి రాత్రి భోజనం చేయడం చాలా ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం సిర్కాడియన్ సైకిల్ కు భంగం కలుగుతుంది, ఇది హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది.
*రూపశ్రీ.